పవన్ కళ్యాణ్ ప్రచార రథం ‘వారాహి’ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. పవన్ తన ఎన్నికల ప్రచారం, యాత్ర కోసం ప్రత్యేక వాహనం వారాహి రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ వాహనం చుట్టూ వివాదాలు వచ్చిపడుతున్నాయి. వైసీపీ నేతలు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. అలివ్ గ్రీన్ రంగుతో వాహనం రూపొందించడం నిబంధనలకు విరుద్ధమని.. ఇది కేవలం ఆర్మీ వారే వినియోగించాలని రూల్స్ ను ప్రస్తావించారు. దీనిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇప్పుడు ఆ వాహన రిజిస్ట్రేషన్ ను రవాణా శాఖ అధికారులు అడ్డుకున్నారు.
కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిని సరిచేశాకే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. దీంతో ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశమైంది. వైసీపీ అభ్యంతరాల నేపథ్యంలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్ వాయిదా వేయడం రాజకీయ రంగు పులుముకుంది. దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని జన సైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Pawan Kalyan Varahi పవన్ వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రీపేర్ చేసుకుంటున్నారు. సంక్రాంతి తరువాత బస్సు యాత్రకు సిద్ధపడుతున్నారు. ఇందుకుగాను వారాహి అనే ప్రచార రథాన్ని సైతం సిద్ధం చేశారు. రెడీ ఫర్ బ్యాటిల్ అంటూ వాహనంతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వాహనంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అప్పటి నుంచి ఏపీలో రచ్చ రంబోలా స్టార్ట్ అయ్యింది.
వైసీపీ ఉలుకుపాటులు, అభ్యంతరాలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి కొద్దిరోజుల్లో కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు జరిపి వినియోగంలోకి తేవాలని భావించారు. ఇంతలో రంగుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలివ్ గ్రీన్ కాకుండా పసుపురంగు వేసుకోవాలని కొందరు మంత్రులు సెటైర్లు వేశారు. దీనిపై పవన్ అదేస్థాయిలో రియాక్టయ్యారు. తొలుత తన సినిమాలను అడ్డుకున్నారని.. తరువాత విశాఖలో పార్టీ కార్యక్రమాలను అడ్డగించారని.. ఇప్పుడు ప్రచార రథంపై పడ్డారని విమర్శలు గుప్పించారు. రంగుపై వివాదం కొనసాగుతుండగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కు రవాణా శాఖ అధికారులు అభ్యంతరాలు తెలిపారు. ముఖ్యంగా అలివ్ గ్రీన్ రంగుతో పాటు లారీ చాసీని బస్సుగా మార్చడం, ఎత్తును పెంచడం, మైనింగ్ లారీలకు వినియోగించే టైర్లను అమర్చడం వంటి వాటిపై అధికారులు అబ్జక్షన్ చేశారు. వాటిని సరిచేసుకొని వస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ మంత్రులు, నేతలు ఆది నుంచి ప్రచార వాహనంపై విషం చిమ్ముతున్నారు. లేని పోని ప్రచారం చేస్తున్నారు. వివాదాలు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోని రవాణా శాఖ రిజిస్ట్రేషన్ ను అడ్డగించడం తాము ఊహించిన పరిణామమే అంటూ జనసైనికులు కామెంట్స్ చేస్తున్నారు.