రాజకీయ అపర చాణుక్యుడు చంద్రబాబు. ఆ మాట అనే దానికంటే అసలు సిసలైన రాజకీయ నాయకుడు అంటేనే ఆయనకు అతికినట్టు సరిపోతుంది. స్వతహాగా ఆయన స్ట్రాటజిస్ట్ అంటారు. ఆయన రాజకీయ లెక్కలు వేయడంలో నేర్పరి అంటారు. కానీ అవి కొన్నిసార్లే వర్కవుట్ అయ్యాయి. ఫెయిలైన సందర్భాలే అధికం. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి దారుణంగా ఓడిపోయారు. 2009లో మహా కూటమి కట్టారు. అప్పుడూ ఫెయిలయ్యారు. 2019లో కూడా తన బద్ధ విరోధి అయిన కాంగ్రెస్ తో సైద్ధాంతిక విభేదాలు పక్కనపెట్టి కూటమి కట్టారు. అప్పుడు కూడా దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు వ్యూహాలు పన్నుతున్నారు.
జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. కానీ అంతా ఈజీ అయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. Chandrababu Naidu గత అనుభవాల దృష్ట్యా బీజేపీ కేంద్ర పెద్దలు చంద్రబాబును నమ్మడం లేదు. నమ్మదగిన మిత్రుడిగా భావించడం లేదు. అందుకే ఏపీలో తమ పొత్తు కేవలం జనసేనతో మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. గత మూడున్నరేళ్లుగా ఇదే చెబుతూ వస్తున్నారు. కానీ చంద్రబాబు ఆశలు వదులుకోలేదు. అదే పనిగా ఆ రెండు పార్టీల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే జనసేన విషయంలో ఇటీవల వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
ప్రారంభంలో చూపిన ఆసక్తి చూపించడం లేదు. అయితే నిజంగానే.. లేక వ్యూహాత్మకంగా అలా వ్యవహరిస్తున్నారా? అన్నది అంతుపట్టడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సభలు, సమావేశాలతో పాటు బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. పార్టీ వినూత్నంగా చేపడుతున్న ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. చంద్రబాబు సభలకు భారీగా జనాలు తరలివస్తున్నారు. మారిన ఈ పరిస్థితులను చూసి చంద్రబాబు సర్వే సంస్థల ద్వారా తెప్పించుకున్న నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడైనట్టు తెలుస్తోంది.
గతంలో కంటే టీడీపీ బలం పెరిగినట్టు సర్వే నివేదికలో తేలినట్టు తెలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాలో 15 స్థానాల వరకూ తెచ్చకుంటుందోని.. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి ఆ సంఖ్య 50 స్థానాల వరకూ ఉంటుందని.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో 30 నుంచి 40 స్థానాలు కలుపుకుంటే దాదాపు 90 స్థానాల వరకూ టీడీపీ గెలుచుకునే అవకాశముందని ఈ సర్వే సారాంశం. అదే జనసేన కలిస్తే 125 వరకూ సంఖ్య పెరిగే అవకాశముందని సర్వే నివేదికలో వెల్లడైనట్టు సమాచారం. అందుకే ప్రస్తుతానికి పొత్తుల అంశం పక్కన పెట్టి చంద్రబాబు పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.