జనసేన ఎన్నికల ట్రాక్ లోకి వస్తోంది. తెలంగాణలో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. ఏపీలో ఏడాదిన్నర ఉంది. అందుకే రెండు రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. పరోక్షంగా తమ విధానంపైన నాదెండ్ల క్లారిటీ ఇవ్వడం విశేషం. ఎన్నికలకు సంబందించిన పొత్తులతో సహా అన్ని అంశాలపై నాదెండ్ల మనోహర్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో జరుగుతున్న పొత్తుల వ్యవహారంపై స్పష్టతనిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ చెబుతూ వచ్చిన ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అన్న నినాదాన్ని నాదెండ్ల మనోహర్ వినిపించడం ప్రాధాన్యత సంతకరించుకుంది. ఇప్పటికే ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నాదెండ్ల స్పష్టం చేశారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకోవాలని.. అందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పిన విషయాన్ని మనోహర్ ప్రస్తావించారు. పార్టీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక.. ఎన్నికలకు ఎలా సిద్ధం కాబోతున్నామనే విషయాన్ని పారదర్శకంగా వెల్లడిస్తామని మనోహర్ తెలిపారు. నాదెండ్ల మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఏపీలో వైసీపీని ఓడించేందుకు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండేందుకు పొత్తులు పెట్టుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. టీడీపీ, జనసేన కలిసే పోటీచేస్తాయనే అంచనాలు ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ప్రధాని మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటి తర్వాత టీడీపీతో కలవడంపై సందిగ్ధత ఏర్పడింది.
పవన్ ఒంటరిగా రాజకీయాలు చేయాలని డిసైడ్ అయినట్టు సంకేతాలు పంపారు. టీడీపీతో పవన్ వెళ్లరని.. బీజేపీతోనే ఉంటారని అంతా భావించారు. అయితే జనసేన-బీజేపీ కలిసి మాత్రం కార్యాచరణ నిర్ణయించలేదు. వైసీపీ మాత్రం ఎన్నికల సమాయానికి టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని చెబుతోంది. వచ్చే వేసవిలో పవన్ బస్సు యాత్ర మొదలు కాబోతోంది. ఈ క్రమంలోనే అప్పటికే పొత్తులపై క్లారిటీ ఇవ్వవచ్చని చెబుతున్నారు. నాదెండ్ల మాటలను బట్టి పొత్తులపై పవన్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటామన్నారంటే ఖచ్చితంగా ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా పొత్తులు ఉంటాయని చెప్పినట్టైంది. ఏపీలో పొత్తులు ఖాయం అని తేలడంతో ఇప్పుడు తెలంగాణలోనూ జనసేన అడుగులు వేస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి జనసేన సిద్ధమైందని.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించినట్టు జనసేన తెలంగాణ ఇన్ చార్జి శంకర్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే టికెట్ల కేటాయింపుపై 32 నియోజకవర్గాలకు కార్యనిర్వాహకుల నియామకాన్ని పూర్తి చేశామన్నారు. తెలంగాణలో పోటీకి సిద్ధంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం అవుతోంది. కార్యనిర్వాహకుల జాబితా కూడా విడుదలైంది. ఇక్కడ ఎలాంటి పొత్తులు లేకుండా..బీజేపీతో కలవకుండా జనసేన ఒంటరిగానే పోటీచేయాలని చూస్తోంది. ఏపీలో పొత్తులు.. తెలంగాణలో ఒంటరి పోరుకు జనసేన రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంత ప్రభావం చూపిస్తుందన్నది వేచిచూడాలి.