హైడ్రామా ముగిసింది.. ఔను, సీబీఐ ఆమెను లిక్కర్ కేసులో అరెస్టు చేస్తుందనే ప్రచారం జరిగినా.. అలాంటి అరెస్టులేమీ జరగలేదు. ముందుగా నోటీసు ఇచ్చి, కవిత ఇచ్చిన సమయానికి అనుగుణంగా ఆమెను సీబీఐ నేడు విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పై ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె మీద ‘లిక్కర్ క్వీన్’ అనే ఆరోపణలు చేస్తోంది బీజేపీ.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తెలంగాణ లింకులు బయటపడటం ఆశ్చర్యకరమే. కవితను ఏం ప్రశ్నించారో ఏమో.. లిక్కర్ స్కామ్‌కి సంబంధించి కొందరు బడా వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారన్నది సీబీఐ, ఈడీ చేస్తోన్న అభియోగాల సారాంశం. ఆ లిస్టులో కవిత పేరు కూడా వుంది. ఈ క్రమంలోనే కవితను సీబీఐ విచారించింది. ఇప్పటికే పట్టుబడ్డ నిందితులు అందించిన సమాచారం మేరకు కవితను విచారించినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.
సుమారు ఏడు గంటలపాటు కవితను విచారించిన సీబీఐ, విచారణ ముగిసినట్లు ఆమెకు తెలిపి.. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. మరోమారు ఈ కేసు విషయమై కవిత విచారణ ఎదుర్కొంటారా.? అన్నదానిపై స్పష్టత లేదు. కుట్ర పూరిత ఆరోపణలంటూ లిక్కర్ స్కామ్ విషయమై ఇప్పటికే కవిత వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.