తెలంగాణపై గుజరాత్ పెత్తనమా.? అంటూ గులాబీ శ్రేణులు గుస్సా అవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడా ప్రాంతీయ వ్యవహారాలు తెరపైకొస్తుండడం శోచనీయమే మరి.! గుజరాత్ అంటే మోడీ.. మోడీ అంటే గుజరాత్.. ఆ లెక్కన, గుజరాత్ పెత్తనం దేశమంతానా.? అన్న ప్రశ్న తెరపైకి రావడం సహజమే. ఇక, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ (తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారింది కదా..) కల్వకుంట్ల కవితను నిన్న సీబీఐ విచారించింది.
ఏడున్నర గంటలపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి కవితపై సీబీఐ ప్రశ్నాస్త్రాలు సంధించింది. గుజరాత్ అధికారి.. నిన్న కవితను విచారించిన సీబీఐ టీమ్‌కి రాఘవేంద్ర వత్స అనే ఐపీఎస్ అధికారి నేతృత్వం వహించారు. ఆయన గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా చెబుతున్నారు. ‘ఇది చాలదా గుజరాత్ పెత్తనం, గుజరాత్ కుట్ర గురించి చెప్పడానికి.?’ అంటూ గులాబీ శ్రేణులు గుస్సా అవుతున్నాయి.
ఐపీఎస్, ఏఐఎస్ స్థాయి అధికారులనే కాదు.. ప్రభుత్వాధికారులకు ప్రాంతీయతను ఆపాదించడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ కూడా తెరపైకొస్తోంది. కాగా, కవిత ను మొబైల్ ఫోన్ల ధ్వంసం వ్యవహారంపై సీబీఐ ఆరా తీసినప్పటికీ, ఆమె నుంచి సరైన సమాధానాలు రాలేదట. ఇంకోసారి ఆమెను సీబీఐ విచారించే అవకాశముంది.