మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు అమ్మాయిలు 25 నుంచి 26 ఏళ్లు, అబ్బాయిలు 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. చదువులు, ఉద్యోగ వేట, ఆర్థిక స్వాతంత్య్రం వచ్చే వరకు పెళ్లి జోలికి పోవడం లేదు. వివాహం చేసుకున్న తరువాత కూడా రెండు మూడేళ్లు పిల్లలు వద్దనుకునే జంటలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమయంలో ఎక్కువ మంది దంపతులు గర్భ నిరోధక మాత్రలు, ఇతర సాధనాలు వాడుతుంటారు. ఇక పిల్లలు కావాలనుకున్నప్పుడు విభిన్న కారణాల వల్ల ఆలస్యమవుతుంటుంది. అయినప్పటికీ పిల్లలు కావాలనుకునే దంపతులు కొన్ని విషయాల్లో జాగ్రత్తపడుతూ తమ కల నెరవేర్చుకోవచ్చని ఫర్టిలిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే స్త్రీ వయస్సు పెరుగుతున్న కొద్దీ అండం విడుదల చేసే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. పరిమాణంతో పాటు అండాల నాణ్యత కూడా తగ్గుతుంటుంది.
అయితే ఇక్కడ ఫెర్టిలిటీ సమస్యలు కేవలం స్త్రీ ఎదుర్కొనే సమస్యలుగా మాత్రమే చూడరాదు. మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడం, వీర్యకణాల్లో కదలిక లేకపోవడం, వీర్య కణాలు నాణ్యంగా లేకపోవడం వంటి సమస్యల కారణంగా ఇప్పుడు ఫర్టిలిటీ సమస్యలు ఎదురవుతున్నాయి. మదర్స్ లాప్ ఐవీఎఫ్ సెంటర్ మెడికల్ డైరెక్టర్, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శోభా గుప్తా ఈ అంశాలపై హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో మాట్లాడారు. ’40 ఏళ్ల కిందటితో పోల్చితే ఇప్పుడు సగటు పురుషుడి వీర్యకణాల సంఖ్య సగానికి తగ్గింది. పైగా చలనశీలత కూడా తగ్గింది. స్త్రీ పురుషోత్పత్తి వ్యవస్థలోకి మెజారిటీ వీర్యకణాలు సహజంగా వెళ్లేంతగా ఈ కదలికలు లేవు..’ అని విశ్లేషించారు. మానసిక సమస్యలు లేకపోయినప్పటికీ, కొన్ని లైఫ్‌స్టైల్ ప్రభావాలు కూడా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. బరువు పెరగడం, ఆల్కహాల్ అతి వినియోగం వంటివి కూడా ప్రభావం చూపుతాయి. అయితే సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి డాక్టర్ శోభా గుప్తా కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చారు. సెక్స్‌లో ఎప్పుడు పాల్గొనాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి వంటి అంశాలపై ఆమె మాట్లాడారు. ఆయా సలహాలు ఆమె మాటల్లోనే.. 1. EAT HEALTHY MEALS: పౌష్ఠికాహారం తీసుకోవాలి మీరు పిల్లలు కనాలని ప్రయత్నిస్తున్నప్పుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. మీలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం పెరగానికి మీకు తగినంత పౌష్ఠికాహారం అవసరం. అప్పుడే మీ శరీరం పిల్లలు కనేందుకు సిద్ధంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, కాంప్లెక్స్ కార్బొహేడ్రేట్స్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మీ ఆహారంలో భాగమవ్వాలి.
కేవలం స్త్రీలే కాకుండా, పురుషులు కూడా ఈ పౌష్టికాహార డైట్ అలవరుచుకోవాలి. స్త్రీలలో ఉండే రక్తహీనతను తగ్గించడానికి క్యారెట్లు బాగా సాయపడతాయి. అలాగే పురుషులకు స్పెర్మ్ క్వాలిటీ పెంచేందుకు జింక్ వంటి ఖనిజలవణాలను కూడా ఇది అందిస్తుంది. 2. LOWER STRESS: ఒత్తిడి తగ్గించుకోవాలి స్ట్రెస్ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. విభిన్న అనారోగ్యాలు, అసౌకర్యాలు కూడా ఈ స్ట్రెస్‌కు కారణమవుతాయి. స్త్రీలలో హార్మోన్లను, రుతు చక్రాన్ని నియంత్రించే మీ మెదడులోని హైపోథాలమస్ ఈ స్ట్రెస్ కారణంగా ప్రభావితమవుతుంది. అండాల విడుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అండాల విడుదల ఆలస్యం అయ్యేలా చేయొచ్చు. లేదా అసలే విడుదల కాకుండా చేయొచ్చు. అందువల్ల మీరు ఒత్తిడి నుంచి బయటపడేందుకు గల మార్గాలను వెతకాలి. యోగా, ధ్యానం వంటి సహజ పద్ధతులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 3. WATCH THE ACTION: వీటికి దూరంగా ఉండండి ప్రెగ్నెన్నీతో ఉన్న మహిళలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, ఆల్కహాల్ అస్సలే తాగొద్దని, విపరీతంగా నాన్-వెజ్ ఫుడ్ తీసుకోవద్దని వైద్యులు సలహా ఇస్తుంటారు. గర్భం దాల్చడానికి ముందు కూడా వీటికి దూరంగా ఉంటే మీరు త్వరగా కన్సీవ్ అయ్యేందుకు తోడ్పడుతుంది. రోజుకు 2 డ్రింక్స్ కంటే ఎక్కువగా అస్సలే తీసుకోవద్దు. ఈ నిబంధన పాటించకపోతే ఈస్ట్రోజెన్ స్థాయిలో మార్పులు కలుగుతాయి. తద్వారా అండాల విడుదల తగ్గుతుంది. కెఫైన్ వినియోగం కూడా ఈస్ట్రోజెన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. ఈస్ట్రోజెన్ తగ్గితే అండాల విడుదల తగ్గుతుంది. కన్వీస్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. యోనిలో పురుషుడి వీర్యం స్కలనం అయ్యాక సెర్వైకల్ మ్యూకస్‌లోకి వేగంగా చేరుతుంది. అండంతో కలిసి పలధీకరణ చెందేందుకు వీలుగా వీర్యకణాలు సెర్విక్స్ చేరుకోవడానికి ప్రయత్నిస్తాయి.
అయితే ఇలా వాటంతట అవే సహజంగా చేరుకోవడంలో కేవలం 1 శాాతమే సక్సెస్ అవుతాయి. ఇలాంటప్పుడు మీరు మీ భంగిమ మార్చడం వంటి ప్రత్యామ్నాయాలు ఆచరించవచ్చు. సెక్స్ తరువాత స్పెర్మ్ యోని నుంచి బయటకు రాకుండా మీ కాళ్లను అలాగే పైకి ఎత్తి పట్టుకోవడం వంటివి చేయొచ్చు. 4. ENGAGE IN REGULAR SEX: సెక్స్‌లో తరచుగా పాల్గొనండి పలు అధ్యయనాల ప్రకారం అరుదుగా సెక్స్‌లో పాల్గొనే దంపతులతో పోల్చితే రోజు తప్పించి రోజు సెక్స్‌లో పాల్గొన్న దంపతుల్లో సంతానోత్పత్తి కలిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఒక తప్పనిసరి చర్యగా కాకుండా సెక్స్‌ను ఆనందించాలి. అలాగే ప్రెగ్నెంట్ కావడానికి టైమింగ్ కూడా చాలా ముఖ్యం. రుతుచక్రం సక్రమంగా ఉన్న మహిళల్లో కూడా పునరుత్పత్తికి అవకాశం ఎక్కువగా ఉన్న సమయం వేరుగా ఉండొచ్చు. 5. START SEEKING PREGNANCY EARLY: ప్రెగ్నెన్సీ త్వరగా కోరుకోండి 30 ఏళ్లకు వచ్చేసరికి సహజ గర్భధారణ విషయంలో మీ భావనలు మీకు కాస్త అసౌకర్యంగా అనిపించవచ్చు. అండం నాణ్యత, అండాల సంఖ్య వంటి వాటిపై ప్రభావం ఉండే ప్రమాదం ఉన్నందున మిస్ క్యారేజ్ అయ్యేందుకు కూడా దారితీయొచ్చు. తమ వయస్సు వారు ఇదివరకే పిల్లలను కని ఉంటే వీరిలో ఒక రకమైన యాంగ్జైటీకి దారితీయొచ్చు. దీని వల్ల మెంటల్ స్ట్రెస్ మొదలవుతుంది. అందువల్ల కుదిరితే ఇంకా ముందుగానే సంతానం కోసం ప్రయత్నించడం వల్ల ఈ అనవసరపు స్ట్రెస్ ఉండదు. అలాగే అండాల నాణ్యత, సంఖ్య తగ్గకుండా ఉంటుంది. 6. SEE YOUR DOCTOR FOR ADVICE IF YOU HAVE NOT CONCEIVED AFTER SIX MONTHS: ఆరు నెలలు దాటినా ఫలితం లేకుంటే కొన్ని సందర్బాల్లో సైకలాజికల్ అంశాలు కూడా వాటి పాత్ర పోషిస్తాయి. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, హార్మోన్ల సమస్యలు, త్వరగా మెనోపాజ్ రావడం, ఫాలోపియన్ ట్యూబ్ అవాంతరాలు
, గర్భాశయ స్వరూపంలో అసాధారణతలు వంటి అంశాల కారణంగా స్త్రీలు అండాలను విడుదల చేయడంలో విఫలమవుతారు. ఎండోమెట్రియోసిస్, యుటెరిన్ ఫైబ్రాయిడ్స్ వంటివి కూడా ఫర్టిలిటీని దెబ్బతీస్తాయి. వయస్సు పైబడితే ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. అలాగే మీ భాగస్వామి కూడా ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలకు కారణం అయి ఉండొచ్చు. స్పెర్మ్ తక్కువగా ఉండడం, స్మెర్మ్‌లో అసాధారణతలు, స్పెర్మ్ మొబిలిటీ వంటి వాటలో సమస్యలు ఉండొచ్చు. సెమెన్ క్వాలిటీ కూడా టెస్టికల్స్‌లో ఎదురయ్యే సమస్యల వల్ల ప్రభావితం అవుతుంది. దెబ్బతాకడం, క్యాన్సర్, సర్జరీ, ఇన్ఫెక్షన్ వంటి కారణాలు ఉండొచ్చు. కొందరు పురుషుల్లో ఎజాక్యులేషన్ సమస్యలు కూడా ఉంటాయి. స్పెర్మ్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడానికి హార్మోన్ల సమస్యలు కూడా ఉండొచ్చు. కొన్ని చిన్నచిన్న టెస్టులు చేసి మీ వైద్యుడు ఆ సమస్యలను గుర్తిస్తారు. చికిత్స అవసరమైతే దంపతులను ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌కు రెఫర్ చేస్తారు.