రాజకీయంగా బయట తలనొప్పులు చాలవన్నట్టు ఇప్పుడు కుటుంబసభ్యులు కూడా జగన్ కు చికాకులు తెప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న బాబాయి హత్య కేసు విచారణ ఏపీలో వద్దంటూ ఆయన కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు మార్పించుకున్నారు. ఈ ఘటనతో జగన్ గురించి జాతీయ మీడియా ఏకిపారేసింది. సొంత కుటుంబసభ్యులే నమ్మలేనంతగా పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేసింది. అయితే ఇప్పుడు సొంత సోదరి షర్మిళ రూపంలో జగన్ కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. అటు కేంద్రంతో పాటు పక్కన కేసీఆర్ వద్ద ఆమె చర్యలు జగన్ ను పలుచన చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లిన జగన్ వద్ద ప్రధాని మోదీ స్వయంగా ఆరా తీసినట్టు వార్తలు వచ్చాయి. సోదరికి తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే మీరెందుకు మాట్లాడలేదని ప్రశ్నించినట్టు కామెంట్స్ వినిపించాయి.
అటు తన సన్నిహితుడైన కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్న సోదరి షర్మిళ తీరుపై జగన్ నొచ్చుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఆమె భర్త, జగన్ బావ అయిన బ్రదర్ అనిల్ కుమార్ ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. Jagan- Brother Anil గత ఎన్నికల తరువాత , జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సోదరి షర్మిళతో గ్యాప్ పెరిగింది. ఆమె కూడా సోదరుడి తీరుపై బాహటంగానే వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. తాను జగన్ జైలులో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డానో అందరికీ తెలిసిందేనని.. కానీ తీరా అధికారంలోకి వచ్చాక తనను దూరం పెట్టారని బాధపడినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆమె రాజకీయంగా స్టెప్ తీసుకోవడానికి ఒకవంతుకు జగనే కారణమని తెలుస్తోంది. ఆమె వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టడం జగన్ కు ఎంతమాత్రం ఇష్టం లేదని కూడా కామెంట్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే షర్మిళకు ఏ వైసీపీ నాయకుడు సంఘీభావం తెలపడం కానీ.. సాక్షి మీడియాలో కవరేజ్ కానీ లేదు. ఇప్పుడు ఆమె నేరుగా కేసీఆర్ ప్రభుత్వంతో తలపడుతుండడంతో జగన్ డిఫెన్స్ లో పడిపోయారు.
బహుశా అది జరగాలనే కాబోలు షర్మిళ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఫోన్ లో పరామర్శించేసరికి జగన్ ఇబ్బందిపడినట్టు కూడా తెలుస్తోంది. అటు కేంద్ర పెద్దలు, ఇటు కేసీఆర్. మధ్యలో సోదరి షర్మిళ చర్యలతో జగన్ చికాకు పడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో బావ బ్రదర్ అనిల్ కుమార్ మాటలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయి. ఏపీ ప్రజలు పక్కా రాష్ట్రం వైపు చూస్తున్నారని.. ఇక్కడ పాలన ఏమంత బాగాలేదన్నట్టు కామెంట్స్ చేశారు. విశాఖ జిల్లాలో జరిగిన ప్రార్థన కూడికకు అనిల్ హాజరయ్యారు. ఎక్కడా జగన్ కానీ, వైసీపీ పేరు కాని ఉపయోగించకుండా ప్రభుత్వాలు అంటూ మాత్రమే సంబోధిస్తూ కీలక వ్యాఖ్యలుచేశారు. దేవుడి పథకాలు వేరే ఉంటాయని.. ఈ సంక్షేమ పథకాలన్ని స్వార్థం కోసమే అన్నట్టు మాట్లాడారు. దీంతో ఈ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.