ఉదయం వండిన ఇడ్లీని.. సాయంత్రం టేస్టీ స్నాక్‌గా మార్చేయవచ్చు తెలుసా? పైగా దీనిని పెద్దల నుంచి పిల్లలవరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇంట్లోనే చిల్లీ ఇడ్లీసులువుగా తయారు చేసుకోగలిగే ఈ వంట.. మిగిలిపోయిన ఇడ్లీలను ఇట్టే కరిగించేస్తుంది. అయితే ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో.. చిల్లీ ఇడ్లీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * ఇడ్లీ – 6 లేదా 7 * ఉల్లిపాయ – 1 (గుండ్రగా కట్ చేసుకోవాలి) * క్యాప్సికమ్ – 1 (పెద్దది) * పచ్చిమిర్చి – 3 లేదా 4 (సన్నగా తరగాలి) * అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 tsp * వెల్లుల్లి – 1 tsp (తరిగినది) * ఉప్పు – రుచికి తగినంత * పెప్పర్ – 1 tsp * రెడ్ చిల్లీ సాస్ – 1 tbsp * సోయా సాస్ – 1 tbsp * మైదా – 1 tbsp * ఆయిల్ – అవసరం మేరకు తయారీ విధానం ఈ డిష్ తయారు చేయడానికి మీరు మిగిలిపోయిన ఇడ్లీని ఉపయోగించవచ్చు లేదా తాజా ఇడ్లీని కూడా ఉపయోగించవచ్చు.
ముందుగా ఇడ్లీలను తీసుకుని వాటిని కావలసిన ఆకారంలో కట్ చేసుకోండి. ఒక గిన్నెలో కార్న్ స్టార్చ్, ఆల్ పర్పస్ మైదా, ఉప్పు, పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేడి చేసి.. ఇడ్లీలను ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో బాగా కోట్ చేసి.. వాటిని నూనెలో బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి లైట్‌గా వేయించాలి. దీనిలో క్యాప్సికమ్, కొద్దిగా ఉప్పు వేయాలి. ఇప్పుడు దానిలో రెడ్ చిల్లీ సాస్, కెచప్, వెనిగర్, సోయా సాస్ వేసి బాగా కలపండి. కొన్ని సెకన్ల పాటు ఉడికించాలి. కార్న్ స్టార్చ్ లిక్విడ్ వేసి కలపాలి. అనంతరం వేయించిన ఇడ్లీని వేసి బాగా కలపాలి. పచ్చి ఉల్లిపాయలతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి టేస్టీ స్నాక్ రెడీ.