UPDATES  

 సెలవుల్లో టూర్ ప్లాన్

తడోబా టైగర్ రిజర్వ్‌ను తడోబా అంధారి టైగర్ రిజర్వ్ అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉంటుంది. ఢిల్లీ వెళ్లేటప్పుడు తెలంగాణ దాటిన తరువాత దారిలో చంద్రపూర్ కనిపించడం మీరు చూసే ఉంటారు. ఈ జిల్లాలోని భద్రావతి తహసీల్‌లో ఈ తడోబా ఉంటుంది. నాగ్‌పూర్ మరో 150 కి.మీ. దూరంలో ఉందనగా వస్తుంది. ఇది మహారాష్ట్రలోనే అతి పెద్ద జాతీయ ఉద్యానవనం (నేషనల్ పార్క్). దేశంలో ఉన్న 47 టైగర్ రిజర్వ్‌లలో ఈ తడోబా టైగర్ రిజర్వ్ ఒకటి. తడోబా అనే పేరు గిరిజనుల దేవుడైన తరు అనే పేరుపై వచ్చింది. తడోబా, అంధారీ ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజనులు నివసిస్తారు. అంధారి అనేది ఇక్కడ ప్రవహించే నది. తడోబా సరస్సు ఒడ్డున తడోబా మందిరం కూడా ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని గోండు రాజులు పాలించారు.

ఇక్కడ వేటను 1935లో నిషేధించారు. ఆ తరువాత 20 ఏళ్లకు అంటే 1955లో సుమారు 116.54 చదరపు కి.మీ. విస్తీర్ణంలో గల అటవీ ప్రాంతాన్ని జాతీయ ఉద్యాన వనంగా ప్రకటించారు. పొరుగున ఉన్న అడవుల్లో కొంత ప్రాంతాన్ని అంధారి వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. ఆ తరువాత 1995లో రెండింటినీ విలీనం చేసి టైగర్ రిజర్వ్‌గా ఏర్పాటు చేశారు. మొత్తం వైశాల్యం 625.4 చదరపు కిలో మీటర్లు. ఇందులో తడోబా నేషనల్ పార్క్ 116.55 చ.కి.మీ., అంధారి వన్యప్రాణుల అభయారణ్యం 508.85 చ.కి.మీ. ఉంటుంది. తడోబా రిజర్వ్‌లో చిమూరు కొండలు ఉంటాయి. అంధారి అభయారణ్యంలో మొహర్లీ, కోల్సా కొండలు కనిపిస్తాయి. తడోబా టైగర్ రిజర్వ్ సమీప గ్రామం దుర్గాపూర్.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !