తెలంగాణలో పాదయాత్రల సీజన్ కొనసాగుతోంది. వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రకు ప్రస్తుతం ఆమె చిన్నపాటి విరామం ఇచ్చారు. ఇటీవల జరిగిన పలు అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ఆమె తన పాదయాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చారు. మరోపక్క, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విడతల వారీగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. రంగంలోకి రేవంత్ రెడ్డి..
సకల జనుల సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు. జనవరి 26 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. దీన్ని సుదీర్ఘ పాదయాత్రగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాగా, రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రకటనకు పెద్దగా హైప్ రాకుండా, కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు షురూ అయ్యాయి. అయితే, రేవంత్ మాత్రం ఎలాంటి సమస్యలైనా పార్టీలో చర్చించుకోవాలంటున్నారు. అదే సమయంలో తన వర్గం నేతలతో సీనియర్లపైకి అస్త్రాల్ని సంధిస్తున్నారు రేవంత్ రెడ్డి. సొంత పార్టీలో అలజడి నేపథ్యంలో అసలు రేవంత్, ఎలా పాదయాత్ర కొనసాగిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.