ఇటీవల తరచూ చంద్రబాబు ఒక మాట చెబుతూ వస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్నది దాని సారాంశం. అయితే ఆయనకు వైసీపీ ప్రభుత్వం నుంచి కానీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ సమాచారం రావాలి. అది పక్కా సమాచారమైతేనే ఆయన ప్రకటిస్తారని అంతా భావిస్తున్నారు. కానీ పక్కా వ్యూహంతోనే ముందస్తు ఎన్నికలు ఉంటాయని చెబుతూ వస్తున్నారు. జగన్ ను ఆత్మరక్షణలో పడేసేందుకు, ఇరుకున పెట్టేందుకు, ప్రజల్లో బలహీనం చేసేందుకే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ముందస్తు ఎన్నికలంటూ ఏవీ లేవని.. తాము షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్ కు వెళతామని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి సైతం చెబుతున్నారు. అయితే వైసీపీ నుంచి, ప్రభుత్వం నుంచి ముందస్తుపై స్పష్టమైన సంకేతాలు వస్తున్నా చంద్రబాబు మాత్రం ఆ మాటను విడిచిపెట్టడం లేదు. అలాగని పాలకపక్షం నుంచి కూడా ఎటువంటి కదలికలు లేవు. దీంతో చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారన్న టాక్ నడుస్తోంది.
Chandrababu సహజంగా ముందస్తు అనేవి పాలక పక్షం బలహీనతను తెలియజేస్తాయి. పూర్తిస్థాయి పదవీ కాలం పూర్తిచేసే నాటికి ప్రజా వ్యతిరేకత తీవ్రమవుతుందని గ్రహించి అధికార పార్టీ ముందస్తుకు వెళుతుంది. లేకుంటే తమకు అనుకూలమైన సమయమని భావించి ముందస్తుకు సిద్ధపడతారు. అయితే జగన్ సర్కారు అనుకూలత చూపించేటంతగా పాలన సాగలేదు. అలాగని టెర్మ్ పూర్తయ్యే వరకూ ఉంటే ప్రతికూలతాంశాలు పెరిగే అవకాశముంది కానీ తగ్గే సూచనలు లేవు. కానీ జగన్ నుంచి ఎటువంటి ముందస్తు చర్యలు లేవు.అటువంటి సంకేతాలు లేవు. పైగా ఎమ్మెల్యేలు, మంత్రుతో నిర్వహించిన వర్కుషాపుల్లో సైతం దీనిపై జగన్ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. కానీ చంద్రబాబు హడావుడి చూస్తుంటే మాత్రం అనుమానం వేస్తోంది. అయితే ముందస్తు ఎన్నికలుంటాయని ప్రచారం కల్పించడం ద్వారా జగన్ మరింత బలహీనం చేయాలన్నదే చంద్రబాబు వ్యూహం. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. తద్వారా ప్రజల్లో కూడా జగన్ పరపతి తగ్గుతుంది. ప్రజా వ్యతిరేకత మరింత పెంచినట్టవుతుంది. పాలనా వైఫల్యాలను అధిగమించలేక జగన్ చేతులెత్తేశారన్న టాక్ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే ముందస్తు ప్రచారంగా విశ్లేషకులు భావిస్తున్నారు.