ప్రెగ్నెన్సీ వచ్చి 20 వారాలు గడిచాక మీ వైద్యులు ఎనామలీ స్కాన్ రాస్తారు. 18 వారాల నుంచి 21 వారాల మధ్య ఎప్పుడైనా నిర్వహించేందుకు సిఫారసు చేయవచ్చు. దీనినే మిడ్ ప్రెగ్నెన్సీ స్కాన్‌గా పిలుస్తారు. దీనిని సోనోగ్రాఫర్ నిర్వహిస్తారు. మీ గర్భంలో పెరుగుతున్న బేబీ అవయవాల ఆకృతిని ఈ పరీక్ష విశ్లేషిస్తుంది. క్లెఫ్ట్ లిప్(పెదాల చీలిక), స్పైనా బైఫైడా (వెన్నుముక సరైన ఆకృతికి రాకపోవడం), ఎడ్వర్డ్ సిండ్రోమ్ (అదనపు క్రోమోజోమ్స్ ఉండడం), కంజెషనల్ హార్ట్ డిసీజ్(సీహెచ్‌డీ) వంటి పరిస్థితులను తెలుసుకునేలా చేస్తుంది. ప్లెసెంటా పొజిషన్ కూడా తెలియపరుస్తుంది. ఈ 20 వారాల స్కానింగ్ ఆంటీనేటల్ కేర్‌లో ఒక భాగం. మీ బేబీ ముఖ కవలికలను తొలిసారిగా ఈ స్కాన్ రూపంలో చూడొచ్చు. ఎనామలీ స్కాన్ చేసేటప్పుడు సోనోగ్రాఫర్ మీ బేబీని స్క్రీన్‌పై చూపిస్తారు. బేబీ ముఖం, చేతులు మీరు గమనించవచ్చు. సోనోగ్రాఫర్ బేబీ అవయవాల మెజర్‌మెంట్స్ కూడా నోట్ చేసుకుంటారు.
బేబీ తల, బ్రెయిన్ రూపం, స్ట్రక్చర్ పరిశీలిస్తారు. ఏవైనా బ్రెయిన్ సమస్యలు ఉన్నా ఈ స్కానింగ్‌లో గుర్తిస్తారు. క్లెఫ్ట్ లిప్ ఉంటే గుర్తిస్తారు. అలాగే బేబీ వెన్నుముక స్ట్రక్చర్‌ను గమనిస్తారు. బేబీ అంతర్గత అవయవాల ఎదుగుదలను కూడా పరిశీలిస్తారు. గుండె, లోపలి గదులు, గుండె చప్పుడు.. ఇలా అన్నీ గమనిస్తారు. బేబీ కిడ్నీలు, వాటి పనితీరు కూడా గమనిస్తారు. చేతులు, కాళ్లు, పాదాలు, వేళ్లు.. ఇలా అన్నీ గమనిస్తారు. ముఖ్యంగా హెడ్ సర్కఫెరెన్స్ (హెచ్‌సీ), అబ్‌డామినల్ సర్కమ్‌ఫెరెన్స్, (ఏసీ) థైబోన్ (ఫెమర్) లెంథ్ (ఎఫ్ఎల్) కొలతలు తీసుకుంటారు. ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో అనామలీ స్కాన్ రెండోసారి కూడా చేయించుకోవాలని సూచిస్తుంటారు. స్కానింగ్ సమయంలో బేబీ సరైన పొజిషన్‌లో లేనప్పుడు అవయవాలను సోనోగ్రాఫర్ గమనించలేకపోవచ్చు. మీరు ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్నట్టయితే సోనోగ్రాఫర్‌కు బేబీ అవయవాలు సరిగ్గా కనిపించకపోవచ్చు. అందువల్ల 23వ వారంలో మరోసారి సిఫారసు చేయవచ్చు. ప్రెగ్నెన్సీ అనామలీ స్కాన్‌లో ఏవైనా సమస్యలను గుర్తించినప్పుడు సంబంధిత పరీక్షలు మరోసారి చేస్తారు. అంటే బేబీకి హార్ట్ ప్రాబ్లెమ్ ఉన్నట్టు గమనిస్తే ఫెటల్ ఎకో స్కాన్ చేయించాలని చెబుతారు. అంటే మరింత వివరంగా గుండె పనీతీరు తెలుసుకోవచ్చు.