పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ హరి హర వీర మల్లు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి మరో సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చేస్తున్న ఫ్యాన్స్‌కు చాలా రోజులుగా నిరాశే ఎదురవుతోంది. హరి హర వీర మల్లు షూటింగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుండటంతో ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. అయితే కొన్నాళ్లుగా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండటం అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. ఈ మూవీ టీమ్ నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం హరి హర వీర మల్లుకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ సినిమా ఓ మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసుకున్నట్లు విజయ్ చెప్పాడు. మరో సీక్వెన్స్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని, ఈ సీక్వెన్స్ ముగిసినందుకు పవన్ నుంచి తాను ఓ గిఫ్ట్ కూడా అందుకున్నట్లు ఆ ఫొటోను పోస్ట్ చేశాడు. “హరి హర వీర మల్లు మూవీకి సంబంధించి మంగళవారం (డిసెంబర్ 20) ఓ మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశాం. మీరు అందిస్తున్న సపోర్ట్, కురిపిస్తున్న ప్రేమకు కల్యాణ్ బాబుకు కృతజ్ఞతలు. ప్రస్తుతం తర్వాతి సీక్వెన్స్ కోసం ప్రిపరేషన్ మొదలైంది” అని విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పాడు. హరి హర వీర మల్లు మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదొక పీరియడ్ డ్రామా. పవన్ కల్యాణ్‌కు ఇదే తొలి పాన్ ఇండియా మూవీ కాబోతోంది. దీంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. నిధి అగర్వాల్ ఈ మూవీలో పవన్‌కు జోడీగా కనిపిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.