UPDATES  

 టీచర్లకు జీతాలు లేవు.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరు.. ఏపీకి ఇదేంఖర్మ

మీరు చేసేది తప్పు అంటే.. ఎవరైనా ఆత్మ పరిశీలన చేసుకుంటారు. అందునా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచించి తప్పులుంటే సరిదిద్ధుకుంటుంది. కానీ ఏపీలోని వైసీపీ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాము చేసింది తప్పు కాదని వితండవాదం చేస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న ఓ రాష్ట్రం.. దుబారా ఖర్చుల్లో మాత్రం ముందుంది అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరోక్షంగా హెచ్చరించినా ఏపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. చివరకు న్యాయస్థానంలో సైతం తమ అడ్డగోలు వాదనను వినిపిస్తోంది. జీతాలు ఇవ్వలేదని ఉపాధ్యాయులు రోడ్డెక్కే స్థితి ఉందా? అని న్యాయస్థానం ప్రశ్నిస్తే.. దానికి గల కారణాలను వివరించాల్సింది పోయి ఏపీ సీఎస్ జవహార్ రెడ్డి మానాన్న టీచరేనని.. నా చిన్నప్పుడు ఆయన మూడు నెలల జీతం కోసం రోడ్డెక్కడాని చెప్పడం విస్తుగొల్పుతోంది. దీనిని అమాయకత్వం అనుకోవాలో.. ప్రభుత్వ చర్యలను సమర్థించుకోవడం అనుకోవాలో తెలియడం లేదు. కానీ ఒక విషయం మాత్రం అర్ధమవుతోంది. ఆయన మాటలు చూస్తుంటే ఏపీని 40, 50 సంవత్సరాల వెనక్కితీసుకెళ్లినట్లు ఆయన మాటల ద్వారా వెల్లడైంది. AP Salaries ఏపీలో ఇప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయులే కాదు.. జీతాల కోసం చివరకు పారిశుధ్య కార్మికులు సైతం రోడ్డెక్కాల్సిన పరిస్థితిని వైసీపీ సర్కారు తీసుకొచ్చింది. తమకు జీతాలు చెల్లించాలని పారిశుధ్య కార్మికులు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాల్సి వచ్చింది.తమకు జీతాలు ఎందుకివ్వడం లేదని వారు నిలదీసినంత పనిచేశారు. కానీ సహేతుకమైన కారణం చెప్పలేక అధికారులు మౌనాన్ని ఆశ్రయించారు.

అందరి అధికారులది ఒకే మాట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. అందుకే జీతాలు చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని మాత్రం చెబుతున్నారు. అలాగని దుబారా ఖర్చు ఆగింది అంటే అది లేదు. దుబారా మాటేమిటిని అడిగితే మాత్రం అది మాకు తెలియదంటూ సమాధానం చెబుతున్నారే తప్ప.. జీతాల సమస్యకు పరిష్కరించే మార్గాన్ని చూపించలేకపోతున్నారు. ఇప్పుడు కోర్టులో ఏకంగా ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ మాట్లాడుతుండడం ఏపీ సమాజం వారిపై ఆగ్రహం, ఆవేదనతో చూస్తోంది. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఉపాధ్యాయులు వ్యవస్థలో భాగం. ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే వారికి జీతాలు చెల్లించడం ప్రభుత్వ ప్రధాన విధి. కానీ దానిని విస్మరిస్తోంది వైసీపీ సర్కారు. ఏపీలో ఇప్పుడు ఠంచనుగా జీతాలు చెల్లిస్తున్న ఒకే ఒక వర్గం సలహాదారులు. గత ఎన్నికల్లోతమకు పనికొచ్చారని.. వచ్చే ఎన్నికల్లో పనికొస్తారని ప్రభుత్వం ఎడాపెడా సలహాదారులను నియమించింది. వారు ఎవరికి సలహాలు ఇస్తున్నారో.. వారి సలహాలు ఎవరు తీసుకుంటున్నారో తెలియదు కానీ.. వారికి చెల్లించాల్సిన జీతాలు, ఇతర అలవెన్స్ లు మాత్రం సమయానికి వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. కానీ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకునే చిరుద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాలు పెండింగ్ లో పెడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !