చార్లెస్ శోభరాజ్ పేరు గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియదు. సినిమాల్లో కామెడీగా ఇతని పేరుని అడపా దడపా వాడుతుంటారు. బికినీ కిల్లర్‌గా ఇతని పేరు ఒకప్పుడు మార్మోగిపోయింది. అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తాడంటూ ఛార్లెస్ శోభరాజ్ గురించి కథలు కథలుగా చెబుతారు.. నిన్నటితరానికి చెందినవారు. నేపాల్ సుప్రీంకోర్టు ఛార్లెస్ శోభరాజ్‌ని విడుదల చేయాలని ఆదేశించింది. 78 ఏళ్ళ చార్లెస్ శోభరాజ్, దాదాపు 19 ఏళ్ళుగా నేపాల్‌లోని ఖాట్మండు జైల్లో వున్నాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఆయన్ని విడుదల చేసేందుకు నేపాల్ సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. తండ్రి ఇండియన్.. తల్లి వియాత్నాం.! ఛార్లెస్ శోభరాజ్ తండ్రి భారతీయుడు కాగా, తల్లి వియాత్నాం పౌరురాలు. ఫ్రాన్స్ అతని నివాసం.
జైలు నుంచి కరడుగట్టిన బికినీ కిల్లర్ విడుదల.! ఎందుకో తెలుసా.? నార్త్ అమెరికాకి చెందిన ఇద్దరు పర్యాటకుల్ని చంపిన కేసులో శోభరాజ్‌ని 2003లో నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటినుంచీ ఆయన అక్కడే జైల్లో వున్నాడు. నేపాల్‌లో జీవిత ఖైదు అంటే 20 ఏళ్ళ జైలు శిక్ష. 70లలో ఆగ్నేయాసియా దేశాల్లో వరుస హత్యలకు, దోపిడీలకు పాల్పడి ప్రపంచ వ్యాప్తంగా సీరియల్ కిల్లర్ అనే పేరు తెచ్చుకున్నాడు చార్లెస్ శోభరాజ్. భారతదేశంలోనూ పలు జైళ్ళలో 21 ఏళ్ళపాటు జైలు శిక్ష అనుభవించాడు. 15 నుంచి 20 మందిని హత్య చేసినట్లు రికార్డులున్నాయి. అంతకు మించిన సంఖ్యలో ఆయన చేసిన హత్యలుంటాయన్నది ఓ అంచనా. హత్యకు గురైనవారిలో కొందరి శరీరంపై కేవలం బికినీలు మాత్రమే వుండడంతో బికినీ కిల్లర్ అనే పేరు వచ్చింది ఛార్లెస్ శోభరాజ్‌కి.