అల్పాహారం కోసం ఏం సిద్ధం చేయాలా అని ఆలోచిస్తున్నారా? మనలో చాలా మందికి ప్రతిరోజూ ఇది ఒక పెద్ద తలనొప్పి. ఈ ఆలోచనలతోనే సమయం గడిచిపోతుంది. మనకు ఎన్ని రకాల అల్పాహారాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాలకే ఎక్కువగా అలవాటు పడిపోయాం. ఇడ్లీలు చేయాలంటే ఆదొక పెద్ద ప్రాసెస్, త్వరగా దోశలు వేయాలన్నా పిండి పులియబెట్టడం అవసరం. అయినప్పటికీ మనకు చాలా ఇన్‌స్టంట్ దోశ రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. మీకు అలాంటి ఒక దోశ రెసిపీని పరిచయం చేస్తున్నాం. మీరు స్పాంజ్ దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇది పేరుకు తగినట్లుగా మెత్తగా, మృదువుగా ఉంటుంది. రుచిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిని బియ్యం లేదా అటుకులు ఉపయోగించి అప్పటికప్పుడే క్షణాల్లో సిద్ధం చేసుకోవచ్చు. సోమవారం వచ్చిందటే హడావిడిగా ఉంటుంది, ఇలాంటి రోజులలో స్పాంజ్ దోశ సిద్ధం చేసుకొని తినేయవచ్చు. ఇది కొంచెం సెట్ దోశను పోలి ఉంటుంది. కానీ స్పాంజ్ దోశ మెత్తదనం చూసి మీరు ఆశ్చర్యపోతారు. దీని ఉదయం వేళ చట్నీతో తినవచ్చు లేదా మీకు నచ్చిన కుర్మాతో మీకు నచ్చిన సమయంలో ఎప్పుడైనా తినవచ్చు. మరి ఆలస్య చేయకుండా స్పాంజ్ దోశ ఎలా చేయాలో తెలుసుకుందామా? స్పాంజ్ దోశకు కావలసిన పదార్థాలు, తయారీకి సూచనలు ఈ కింద తెలుసుకోండి. Sponge Dosa Recipe కోసం కావలసినవి 1 కప్పు బియ్యం/ మందపాటి అటుకులు 1 కప్పు చిక్కటి పెరుగు 1 కప్పు ఉప్మా రవ్వ 1/2 టీస్పూన్ ఈనో లేదా వంట సోడా రుచికి తగినంత ఉప్పు పోపు దినుసులు దోసె చేయడానికి నూనె స్పాంజ్ దోశ రెసిపీ- తయారీ విధానం ముందుగా ఒక గిన్నెలో బియ్యం లేదా అటుకులను కడిగి నీటిలో కొద్దిసేపు నానబెట్టండి. ఈలోపు మిక్సర్ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు కడిగిన పోహాను మిక్సింగ్ గిన్నెకు బదిలీ చేయండి. అందులో పెరుగు, ఆపై రవ్వ వేయండి, అనంతరం నీరుపోసి చిక్కటి మృదువైన బ్యాటర్ సిద్ధం చేయండి. ఈ బ్యాటర్ లో వంటసోడా లేదా ఈనో వేసుకోవాలి. కాబట్టి దోశ మృదువుగా వస్తుంది. ఇప్పుడు కావాలనుకుంటే నూనెలో పోపు వేయించి దోశ పిండిలో కలిపేయండి. ఇప్పుడు ఒక లోతైన పాన్ తీసుకొని దానికి నూనె పూసి వేడి చేయండి. ఆపై దోశ బ్యాటర్ వేసి మందంగా విస్తరించండి, మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత మరోవైపు తిప్పి కాస్త కాల్చండి. అంతే, మృదువైన మెత్తని స్పాంజ్ దోశ రెడీగా ఉంది. చట్నీ లేదా కుర్మాతో తింటూ దీని రుచిని ఆస్వాదించండి.