తెలుగు రాష్ట్రాల్లో పుల్లారెడ్డి స్వీట్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆ పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత రాఘవరెడ్డిపై స్వయానా ఆయన కోడలు ప్రజ్ఞ రెడ్డి ఫిర్యాదు చేశారు. అదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి. ఈనెల 29న నారాయణమ్మ కాలేజీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్న దరిమిలా, ఆ కళాశాలని నిర్వహిస్తున్న జి.రాఘవరెడ్డి, ఆయన బార్యతిరెడ్డి, వారి కుమార్తె శ్రీ విద్య రెడ్డిపై ప్రగ్య రెడ్డి ఫిర్యాదు చేయడం గమనార్హం. ‘నన్ను, నా కూతుర్ని వేధిస్తున్నారు. ఇద్దరినీ చంపేందుకు ప్రయత్నించారు.
వరకట్నం కోంసం హింసిస్తున్నారు. నా 8 ఏళ్ళ కుమార్తెను ఇంటి నుంచి బయటకు రానీయకుండా రాత్రికి రాత్రే గది బయట గోడ కట్టారు..’ అంటూ వాపోయారు ప్రగ్య రెడ్డి. ఆరోపణలు కాదు.. అందరికీ తెలిసిందే.. ‘నేను చేస్తున్నవి కేవలం ఆరోపణలు కావు. మీడియాలో అందరూ చూశారు. కోర్టు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. గది బయట గోడ కూల్చేయమని ఆదేశించింది.. అధికారులు గోడ తొలగించారు..’ అంటూ తన ఫిర్యాదులో ప్రగ్య రెడ్డి ప్రస్తావించారు. ‘ఓ మహిళగా నన్ను అర్థం చేసుకుని నాకు న్యాయం చేస్తారని ఎదురుచూస్తున్నాను. వారికి వున్న పరపతి నేపథ్యంలో నాపై దాడులు చేయిస్తున్నారు..’ అంటూ అభ్యర్థించారు ప్రగ్య రెడ్డి. ఈ లేఖపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.