సినీ నటి, వైసీపీ నేత, ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమణి తాజాగా కంటతడి పెట్టారు. రోజా కూతురి విషయమై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పట్ల రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్. ఆమెది మృదు స్వభావం. కానీ, ఆమె మీద కొందరు వ్యక్తులు ట్రోలింగ్ చేస్తున్నారు. మార్ఫింగ్ ఫొటోలతో అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు..’ అంటూ రోజా కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల ఆవేదన.. ‘నా కుమార్తె విషయంలోనే కాదు.. నా కుటుంబ సభ్యులందరి విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారు.
నా సోదరులతో నాకు లింకులు పెడుతున్నారు, అసభ్యకరమైన రీతిలో కామెంట్లు చేసి, ట్రోలింగ్ చేస్తున్నారు..’ అంటూ రోజా వాపోయారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌కి అందరూ బాధితులే. రోజా, ఆమె కుటుంబ సభ్యులపై జరుగుతున్న ట్రోలింగ్‌ని ఎవరూ సమర్థించరు. కానీ, రాజకీయ విమర్శలు చేసే క్రమంలో ఆయా నాయకుల వ్యక్తిగత జీవితాలపై రోజా సైతం పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. రాజకీయ నాయకులు చేసే విమర్శలు ముదిరి పాకాన పడ్డంతో, వారిని ఆదర్శంగా తీసుకుంటోన్న అనుచరులు, అభిమానుల వల్లనే సోషల్ మీడియా మరింత దిగజారుడుతనం ప్రదర్శిస్తోంది.