సాధారణ రోజులలో బ్రేక్‌ఫాస్ట్ చేయటానికే సమయం ఉండదు, ఇక బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసుకొని తినేంత టైం ఉంటుందా? కానీ త్వరగా ఏదైనా చేసుకోగలిగే ఇన్‌స్టంట్ రెసిపీలు ఉంటే మాత్రం చేసుకోవచ్చు.
అలా సూపర్ ఫాస్ట్‌గా చేసుకోగలిగే సూపర్ గుడ్ ఫుడ్ ఏదైనా ఉందా అంటే గుడ్డు ఉందని చెప్పవచ్చు. గుడ్డుతో ఫటాఫట్‌గా రుచికరమైన అల్పాహారం చేసుకోవచ్చు, ఎన్నో వెరైటీలు కూడా చేసుకోవచ్చు. అలాంటి ఒక వెరైటీ రెసిపీని ఇక్కడ పరిచయం చేస్తున్నాం.
‘ఆమ్లెట్ ఇన్ ఎ మగ్’ అనే వంటకాన్ని ఎప్పుడైనా తిన్నారా? కనీసం విన్నారా? కానీ మీరు బిజీగా ఉండే రోజుల్లో తక్కువ సమయంలో చేసుకోగలిగే ఒక ప్రసిద్ధ అల్పాహారం ఎంపిక. దుప్పట్లో దూరిన గుడ్డు (Egg in a Blanket) మాదిరిగానే ఆమ్లెట్ ఇన్ ఎ మగ్ (Omelette in a Mug) కూడా ఆద్భుతమైన అల్పాహారం. పేరులో సూచించినట్లుగా దీనిని కప్పులో వండుతారు. ప్రొటీన్‌లతో నిండిన ఈ లెజెండరీ రెసిపీని ఉదయం అల్పాహారంగా, రాత్రి భోజనంగా లేదా అర్ధరాత్రి అల్పాహారంగా కూడా చేసుకొని తినవచ్చు. ఎలా చేయాలో, కావలసిన పదార్థాలేమిటో ఇక్కడ తెలుసుకోండి. కప్పులో ఆమ్లెట్ లేదా ఆమ్లెట్ ఇన్ ఎ మగ్ రెసిపీని ఈ కింద చూడండి.
Omelette in a Mug Recipe కోసం కావలసినవి
1 గుడ్డు
2 గుడ్డులోని తెల్లసొనలు
2 టేబుల్ స్పూన్లు తురిమిన చెడ్డార్ చీజ్
1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు
రుచి కోసం ఉప్పు
రుచి కోసం మిరియాల పొడి లేదా కారం
1 టీస్పూన్ నూనె లేదా కుకింగ్ స్ప్రే
ఆమ్లెట్ ఇన్ ఎ మగ్ రెసిపీ- తయారీ విధానం
ముందుగా మైక్రోవేవ్-సేఫ్ మగ్‌ను తీసుకొని దాని లోపలి భాగంలో నూనె పూయాలి లేదా కుకింగ్ స్ప్రే చేయాలి.
ఆ మగ్‌లో ముందుగా ఒక గుడ్డు పగలగొట్టి వేయాలి, ఆపైన తెల్లసొనలు మాత్రమే వేయాలి.
ఇప్పుడు తురిమిన చెడ్డార్ చీజ్, తురిమిన క్యాప్సికమ్ వేయాలి. వాటిపై ఉప్పు, కారం చల్లాలి.
ఇప్పుడు ఈ మగ్‌ను మైక్రోవేవ్‌లో ఉంచి రెండు నిమిషాల పాటు బేక్ చేయండి.
అంతే కప్పులో ఆమ్లెట్ రెడీ, పైనుంచి కొత్తిమీర చల్లుకోవచ్చు. ఇప్పుడు కప్పులో ఒక స్పూన్ వేసి, ఆమ్లెట్ తింటూ ఆస్వాదించండి.