కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధిలో కొత్త ఏడాది జనవరిలో పలు వేడుకలు జరగనున్నాయి. విశేష పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు.. తేదీ వారీగా జరగనున్న వేడుకల వివరాలను టీటీడీ వెల్లడించింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ పేర్కొంది. జనవరి 2వ తేదీన తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తామని వెల్లడించింది. జనవరి 3న శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి, శ్రీవారి చక్రస్నానం…. జనవరి 7న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం…. అదే రోజు నుంచి 13 వ తేదీ వరకు ఆండాళ్ నీరాటోత్సవం… జనవరి 14న భోగీ పండుగ…. జనవరి 15న తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం, మకర సంక్రాంతి…. జనవరి 16న కనుమ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేం చేస్తారు. తిరుమలనంబి సన్నిధికి వేం చేపు… శ్రీ గోదా పరిణయోత్సవం జరుగుతాయి. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం మరియు వసంత పంచమి వేడుకలు…
జనవరి 28న రథసప్తమి నిర్వహిస్తారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3వ తేదీన ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని.. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠద్వార దర్శనం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని చర్యలు చేపడుతోంది. ఆలయాలను సుందరంగా ముస్తాబు చేసింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు.. టోకెన్లు పొంది తిరుమలకు రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించిన విషయం తెలిసిందే. సర్వదర్శనం కోసం వచ్చే వారి కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేసింది. జనవరి 1వ తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభిస్తామని టీటీడీ వెల్లడించింది. రోజుకు 50 వేల చొప్పున 10 రోజులకు ఐదు లక్షల సర్వదర్శనం టోకెన్లు జారీ చెయ్యనున్నామని వెల్లడించింది. 2022లో తిరుమల శ్రీవారిని దాదాపు 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం ఏడాదంతా కలుపుకొని రికార్డు స్థాయిలో రూ.1,320 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 1.08 కోట్ల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. 11.42 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు తెలిపింది.