క్యాలెండర్ పేజీల సాక్షిగా మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోబోతోంది. మరికొన్ని గంటల్లో మరో ఏడాది స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. సాధారణంగా కొత్త సంవత్సరం అంటే ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది. చుక్క, ముక్క తో యువత చేసే సందడి అంతా ఉండదు. పైగా మహానగరం హైదరాబాద్ లో పరిస్థితి మరింత జోరుగా ఉంటుంది. యువత రోడ్లమీద చేసే హంగామా బీభత్సంగా ఉంటుంది..ఇదే సమయంలో యువత రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకరికొకరు పోటీపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కళ్ళు మూసి తెరిచే లోపు ప్రమాదాలు జరిగిపోతాయి.
New Year 2023 పోలీసులు అలర్ట్ అయ్యారు ఈ నూతన సంవత్సరం నేపథ్యంలో హైదరాబాదులో పబ్ లు, రిసార్టులు, క్లబ్ లు కిటకిటలాడుతుంటాయి. ఈ సందర్భంగా పలు ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉంటాయి. ఐటి, ఫార్మా, ఇతర పరిశ్రమలు భారీగా ఉండడంతో ఉద్యోగులు ఖర్చుకు వెనకాడే పరిస్థితి ఉండదు.. పైగా ఐటి ఉద్యోగులకు వారాంతపు సెలవు దినాలు కావడంతో ఈ జోష్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పైగా హైదరాబాద్ నగరం భారీగా విస్తరించడంతో ఈసారి వేడుకలు అంబరాన్ని అంటేలా ఉంటాయి. అంతేకాదు నగర శివారు ప్రాంతాల్లో వివిధ రిసార్ట్ లు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాయి. దీంతో జనం భారీగా పోటెత్తే అవకాశం ఉంది. ఇక అమ్యూజ్ మెంట్, థీమ్ పార్క్ ల గురించి చెప్పాల్సిన పనిలేదు.