ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ అనేక ఆఫర్లు ప్రకటిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ దీటుగా లాభాల బాట పట్టించేందుకు వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు టికెట్‌లో 25 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పండుగ సీజన్ నేపథ్యంలో మరో ఆఫర్‌తో ప్రయాణికుల ముందుకు వచ్చింది. ఇక నుంచి నలుగురు ప్రయాణికులు కలిసి ఒకేసారి బస్ టికెట్ తీసుకుంటే.. ఛార్జీ మొత్తం ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. నలుగురు ప్రయాణికులలో ఇద్దరు పిల్లలు ఉన్నా ఆఫర్ వర్తిస్తుం
ది. కుటుంబాలతో కలిసి ప్రయాణించే వారికి లాభాదాయకంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ-వాలెట్ ద్వారా టిక్కెట్టును బుక్ చేసుకున్నా.. ఛార్జీలో ఐదు శాతం రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రయాణికులు ఒకేసారి రానూపోనూ టిక్కెట్లను ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణ టికెట్ ఛార్జీ 10 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్‌ను పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక బస్సులకూ వర్తింపజేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సీజన్ భారీ ఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ఈ ప్రత్యేక బస్సుల్లో గతంలో మాదిరి 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. సంక్రాంతి సీజన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్స్ చాలా రోజుల క్రితమే ఓపెన్ చేసింది. https://apsrtconline.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలని సూచించారు. త్వరగా బుక్ చేసుకోండి.. సాధారణ ఛార్జీలతో ప్రయాణించండి అని చెబుతున్నారు.