అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్‌కు తరలించనున్నారు. సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసిన పోలీసులు.. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా పట్టుకున్నారు. పరారీలో ఉండి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశాడు భైరి నరేష్. భైరి నరేష్‌ను అరెస్ట్ చేశామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. నరేష్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప స్వాములు చేపట్టిన ఆందోళనలు విరమించాలని ఆయన కోరారు.
అయ్యప్ప స్వామిపై దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలని రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు, బీజేపీ నాయకులు, హిందూ సంఘాల నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భైరి నరేష్‌పై పలు పోలీస్ స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. భైరి నరేష్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. అతని సోషల్ మీడియా అకౌంట్లపై దృష్టి సారించారు. పరారీలో ఉన్నా కూడా నరేష్ వీడియోలు రిలీజ్ చేస్తూ కామెంట్స్ చేశాడు. దీంతో అతని సోషల్ మీడియాను ట్రాప్ చేశారు. అతని కదలికలపై దృష్టి పెట్టారు. ఖమ్మం నుంచి వరంగల్ వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.