తెలుగు నాట జనసేనాని పవన్ కళ్యాణ్ కు మీడియా సపోర్టు అంతంతమాత్రమే. పేరుమోసిన మీడియా సంస్థలు ఇప్పటికే పెద్దల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి. రెండు కులాల కోసం ఆరాటపడుతున్నాయి. రెండు పార్టీల పల్లకి మోస్తున్నాయి. ఆ మీడియాలో పవన్ కి అవసరానికి తగ్గట్టు చోటు కల్పిస్తుంటాయి. తమకు అనుకూలంగా ఉంటే ఒకలా.. ప్రతికూలంగా ఉంటే మరోలా చూపిస్తాయి. ప్రాధాన్యతను తగ్గిస్తాయి. జనసేన ఆవిర్భావం నుంచి జరుగుతున్నది ఇదే. ఆది నుంచి సాక్షి మీడియాకు అదే అక్కసు. పవన్ వ్యతిరేక కథనాలు వండి వార్చే సాక్షిని నీలిమీడియా అనుసరిస్తుంది. అదే చంద్రబాబుకు పవన్ అవసరముంటే ఎల్లో మీడియాలో పతాక శీర్షికన వార్తలు, కథనాలు వస్తాయి. అదే చంద్రబాబుకు మైనస్ గా మారితే ఏదో మూలన, అప్రాధాన్య వార్త కనీ కనిపించనట్టు చూసిస్తారు. pawan kalyan ఎలక్ట్రానిక్ మీడియా గురించి చెప్పనక్లర్లేదు. రేటింగ్స్ కోసం పవన్ ను ఎంతలా వాడుకోవాలో అంతగా వాడుకుంటారు. చివరకు మాత్రం తాము పల్లకి మోసే పార్టీలకు మైలేజ్ వచ్చేలా మార్చేస్తారు. అయితే పవన్ పార్టీ జనసేనకు గత కొన్నేళ్లుగా సపోర్టుగా నిలిచిన ఏకైక మీడియా చానల్99 టీవీ. కానీ ఇన్నాళ్లూ లేనిది.. రాత్రికి రాత్రే అనూహ్య నిర్ణయం తీసుకుంది.
పవన్ పేరెత్తకుండా రోజు గడవదన్న రేంజ్ లో ఉన్న ఆ చానల్ సడెన్ గా స్వరం మార్చింది. పవన్ గురించి తెలియదన్నట్టు వ్యవహరిస్తోంది. దీని వెనుక కథ ఏంటి? అని అందరూ చర్చించుకుంటున్నారు. 2014 నుంచి చానల్ నడుస్తున్నా.. కొందరికే సుపరిచితం. అది కూడా పవన్ కళ్యాణ్ కు కవరేజీ ఇస్తుండడంతో ప్రత్యేక వీక్షకులను సొంతం చేసుకుంది. అయితే ఇది జనసేన అధికార మీడియా చానల్ అని అందరూ భావిస్తారు. గత కొన్నేళ్లుగా ఆ చానల్ వ్యవహారం కూడా అలానే ఉంది. ఇంతకీ ఈ చానల్ ఎవరిదో తెలుసా? మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖరానిది. 2014లో న్యూ వేవ్స్ మీడియా పేరిట ఈ చానల్ ను చంద్రశేఖర్ రిజస్టర్ చేశారు. మహారాష్ట్ర కేడర్ లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఈ ఐఏఎస్ అధికారి పదవీ విరమణ తరువాత తన గాలి రాజకీయాల వైపు సోకింది. కాపు నేత కావడంతో పీఆర్పీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. గుంటూరు ఎంపీగా 2009లో హేమాహేమీలతో తలపడ్డారు. కానీ ఓటమే ఎదురైంది. అటు తరువాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో కర్చిఫ్ వేశారు. 2014లొ నరసాపురం నుంచి పోటీచేసి చేతులు కాల్చుకున్నారు. అయితే చేతిలో మీడియా ఉంటే గుర్తింపు ఉంటుందన్న భావనతో 99 టీవీ చానల్ ను ఏర్పాటుచేశారు. కానీ అప్పటికే మీడియా సపోర్టు ఉన్న జగన్ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. దీంతో 2019 ఎన్నికల్లో పవన్ చెంతకు చేరారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ఆఫర్ తో బీఆర్ఎస్ లో చేరారు.