తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బండి సంజయ్ చేజారిపోతోందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా బీజేపీలో ఓ వర్గం పావులు కదుపుతోంది. బండి సంజయ్ అతి దూకుడు వల్ల పార్టీ నష్టపోతోందంటూ అధినాయకత్వానికి కొందరు బీజేపీ తెలంగాణ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, బండి సంజయ్‌ని మార్చబోవడంలేదనీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరగబోదనీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.
విభేదాలొద్దు.. కలిసి పనిచేయండి.. పార్టీలో అంతర్గత విభేదాలకు తావు లేదనీ, తెలంగాణ లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ ముఖ్య నేతలకు తరుణ్ చుగ్ సూచించారు. అధినాయకత్వం నిర్ణయం మేరకు, బండి సంజయ్‌తో కలిసి పని చేసి, బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ నేతల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ మీద ఇతర పార్టీలు పన్నుతోన్న కుట్రల్నీ, చేస్తున్న అసత్య ప్రచారాల్ని తిప్పి కొట్టాల్సిందిగా తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ నేతలకు దిశా నిర్దేశం చేశారు.