దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయ్యమన్నట్టుంది కేసీఆర్ ఆలోచన. ఒకరిద్దరు రాజకీయ స్థిరంలేని నాయకులను బీఆర్ఎస్ లో చేర్చి సంబరపడిపోతున్నారు. ఏపీలో పార్టీ విస్తరణ శరవేగంగా జరిగిపోతుందంటూ కలలు కనడం ప్రారంభించారు. సంక్రాంతి తరువాత పార్టీలో చేరికలు గణనీయంగా ఉంటాయని.. తెలంగాణలో ప్రగతి భవన్ మాదిరిగా ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం రద్దీగా మారుతుందంటూ చెప్పేస్తున్నారు. చాలామంది కీలక నాయకులు పార్టీ వైపు వచ్చేస్తారని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా వివిధ పార్టీల్లో సిట్టింగులు సైతం తమకు టచ్ లో ఉన్నారని అతిగా ప్రకటించారు. ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ లో చేరిన తోట చంద్రశేఖర్ కు ఏపీ బాధ్యతలు అప్పగించిన కేసీఆర్.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును ఢిల్లీ బాధ్యతలు అప్పగించారు. ఆయన తన వెంట ఉంటారని.. బీఆర్ఎస్ విస్తరణకు కృష్టిచేస్తారని చెప్పుకొచ్చారు. రావెలలో ఎన్నో సుగుణాలు ఉన్నాయని.. వాటిని పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని కూడా ప్రకటించేశారు. CM KCR On AP BRS నేతల వరకూ చేర్చుకోవడం ఓకే. ఆ మధ్యన రాష్ట్రంలో కుల సంఘాల నాయకులుగా చలామణి అవుతున్న ఒక నలుగురైదుగురు నాయకులను ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. గంటలతరబడి సమయమిచ్చారు. వారితోనేకలిసి భోజనం చేశారు. దీంతో వారు తెగ ఉబ్బిబ్బయ్యారు. తెలంగాణ సాధనకు తనతో కలిసి పనిచేసిన వారికి కేసీఆర్ సమయమివ్వరు. కనీసం కలిసేందుకు చాన్సివ్వరు. అటువంటిది తమను పిలిచి భోజనం పెట్టేసరికి తమకింత గౌరవమా? అని వారు తెగ సంబరపడిపోయారు. అయితే వారు ఏపీ సమాజంలో కనిపించింది చాలా తక్కువ. అసలు వారు పేర్లు కూడా పెద్దగా ప్రాచుర్యంలో లేవు.
అటువంటి నాయకులను కేసీఆర్ భూతద్ధంలో పెట్టి చూపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును నమ్ముకుంటే కుక్కతోకను పట్టుకొని గోదారిని ఇదినట్టే అవుతుందన్న టాక్ ఏపీ సమాజంలో వినిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు కేసీఆర్ గాలానికి నేతలు చిక్కకు పోయేసరికి దారిన పోయే దానయ్యలను పట్టుకొని ఏపీని ప్రభావితం చేసే నాయకులుగా చూపేందుకు కేసీఆర్ ఆరాటపడుతుండడాన్ని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తోట చంద్రశేఖర్.. ఈయనొక మాజీ ఐఏఎస్ అధికారి. మహారాష్ట్ర కేడర్ లో పనిచేశారు. మంచి గుర్తింపుగల అధికారిగా పేరు దక్కించుకున్నారు. అటు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ప్రచారం ఉంది. పదవీవిరమణ చేశాక రాజకీయాలు మొదలుపెట్టారు. రాజకీయంగా కుదురుకోవాలని ఆశించారు. రాజకీయ అరంగేట్రం చేసిన తరువాత ఒక చోట కుదురుగా ఉండిన దాఖలాలు లేవు. కాపు నేత కావడంతో పీఆర్పీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. గుంటూరు ఎంపీగా 2009లో హేమాహేమీలతో తలపడ్డారు. కానీ ఓటమే ఎదురైంది. అటు తరువాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో కర్చిఫ్ వేశారు. 2014లొ నరసాపురం నుంచి పోటీచేసి చేతులు కాల్చుకున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ చెంతకు చేరారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. నాలుగే నాలుగు భారీ కటౌట్లతో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా మారిపోయారు.