:చుండ్రు మీ జుట్టును మురికిగా చేయడమే కాకుండా.. మీ ముఖం, వీపు, భుజంపై అనేక రకాల సమస్యలను కూడా పెంచుతుంది. చుండ్రు అనేది చాలా సాధారణమైన సమస్యే అయినా.. మీరు దానిని సకాలంలో పరిష్కరించకపోతే.. అది శాశ్వతంగా మారిపోతుంది. ఇబ్బందులను కలిగిస్తుంది. చుండ్రు మీ జుట్టును మురికిగా చేయడమే కాకుండా.. మీ ముఖం, వీపు, భుజంపై చర్మ సమస్యలను పెంచుతుంది. మీ ముఖంపై మొటిమలు, దురద వంటివి రావడంలో చుండ్రు ప్రధానపాత్ర పోషిస్తుంది. చాలా సందర్భాలలో చెవి దురదను కూడా రప్పిస్తుంది. చర్మం తర్వాత ఈ చుండ్రు మీ గోళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా కలిగిస్తుంది. అంటే చుండ్రు అనేది తలకే కాదు.. గోళ్లకు కూడా హానికరమే. అందుకే సమయానికి చుండ్రుపై తగిన శ్రద్ధ చూపించడం అవసరం. అయితే సహజమైన నివారణితోనే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అదే నిమ్మకాయ. అయితే చుండ్రు రావడానికి గల కారణాలు ఏమిటో.. నిమ్మకాయతో ఈ సమస్యను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. చుండ్రు రావడానికి కారణాలు ఇవే.. మీ తలపై వివిధ కారణాల వల్ల చుండ్రు రావొచ్చు. ప్రతిసారీ ఈ సమస్యకు ఒకే ఒక కారణం ఉండాల్సిన అవసరం లేదు.
అదేవిధంగా ఒకే సమయంలో వేర్వేరు వ్యక్తులలో చుండ్రు కారణాలు కూడా భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ.. తలలో చుండ్రు అత్యంత సాధారణ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. * జుట్టులో పోషకాహార లోపం * చర్మం pH స్థాయి క్షీణించడం * శరీరంలో నీరు లేకపోవడం * రసాయన ఆధారిత ఉత్పత్తుల అధిక వినియోగం * శిరోజాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం * కాలుష్యం నిమ్మకాయతో చుండ్రు ఎలా పోగొట్టుకోవాలంటే.. చుండ్రును పోగొట్టడానికి నిమ్మకాయ, కొబ్బరి నూనె బాగా హెల్ప్ చేస్తాయి. మీకు కావలసిందల్లా 2-3 చెంచాల కొబ్బరి నూనెను, 1 చెంచా నిమ్మరసంలో బాగా కలపాలి. ఇవి బాగా కలిసిన తర్వాత.. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో తలలో మాడుకు అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలపై కనీసం 1 గంట పాటు ఉంచండి. దీని తర్వాత మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. ఉసిరి, కలబంద వంటి సహజ మూలికలు ఉపయోగించిన షాంపూలనే మీరు ఉపయోగించాలి. నిమ్మకాయ, కొబ్బరి నూనెను వారానికి ఒకటి లేదా రెండుసార్లు రాసుకుంటే చుండ్రు శాశ్వతంగా నయం అవుతుంది. ఇది సమస్యకు కారణమయ్యే దానిపై ఆధారపడి ఉంటుందనే విషయం కూడా మీరు గుర్తించుకోవాలి. దీనితో పాటు.. మీరు మీ ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. తద్వారా మీ జుట్టుకు పూర్తి పోషకాహారం లభిస్తుంది. స్కాల్ప్ తేమగా ఉంటుంది. వెంట్రుకలను కడుక్కునేటపుడు గోరువెచ్చని నీళ్లను వాడండి. వేడి నీళ్లతో స్నానం చేస్తే.. ఈ చుండ్రు సమస్య మరింత ఎక్కువ అవుతుంది.