UPDATES  

 వారసుడు మూవీ ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ దళపతి విజయ్‌ ఈ సంక్రాంతికి టాలీవుడ్‌ పెద్ద హీరోలతో పోటీ పడబోతున్నాడు. అతడు నటించిన బైలింగ్వల్‌ మూవీ వారసుడు జనవరి 12న రిలీజ్‌ కాబోతోంది. అదే రోజు వీర సింహా రెడ్డి కూడా రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా ఈ సినిమా వస్తోంది. తాజాగా వారసుడు రన్‌టైమ్‌ను కూడా మేకర్స్‌ రివీల్‌ చేశారు. ఈ సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే పెద్ద మూవీగా ఇది నిలిచింది. ఏకంగా 2 గంటల 49 నిమిషాల నిడివితో వారసుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. వారసుడు ట్రైలర్‌ బుధవారం (జనవరి 4) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. సన్‌ టీవీ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ ట్రైలర్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా సెన్సార్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

దీనికి క్లీన్‌ యు సర్టిఫికెట్‌ రావడం విశేషం. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వారసుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా ఇటు డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి, అటు ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు కోలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. బీస్ట్‌ మూవీ తీవ్రంగా నిరాశ పరిచిన తర్వాత వస్తున్న విజయ్‌ మూవీ కావడంతో వారసుడుపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్‌ సరసన రష్మిక మందన్నా నటించింది. తమన్‌ మ్యూజిక్‌ అందించాడు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, ఖుష్బూ, శ్రీకాంత్‌ కూడా వారసుడులో నటించారు. ఈ సినిమా థియేటర్ల విషయంలో ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు అటు తమిళనాడులోనూ రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ దిల్‌ రాజు మూవీ కావడంతో వారసుడు మూవీకి ఎక్కువ సంఖ్యలో థియేటర్లు లభించాయి. దీనిపై ఇక్కడి సంక్రాంతి సినిమాల ప్రొడ్యూసర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే తమిళనాడులో మాత్రం ఇది రివర్సయింది. అక్కడ అజిత్‌ కుమార్‌ తునివు మూవీ రిలీజ్‌ కానుండటం, దానిని సీఎం స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ రిలీజ్‌ చేస్తుండటంతో మెజార్టీ థియేటర్లలో ఆ సినిమా రిలీజ్ కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !