క్రీడాకారులు ఆనందం మనకు సంతోషం…. రేగా
-ప్రతి ఏడాది కేసీఆర్ కప్ క్రీడలు.
-నాయకులు ప్రతిరోజూ క్రీడలను పర్యవేక్షించాలి.
-ప్రతి టీమ్ కు వాలీబాల్, నెట్ ఉచితం.
-మార్చిలో క్రికెట్ టోర్నమెంట్.
-అన్ని గ్రామాల్లోని క్రీడా మైదానాల్లో దసరా వేడుకలు.
-పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు.
మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 07: కెసిఆర్ కప్ వేదికగా క్రీడా సంబరాలు మణుగూరులో మొదలయ్యాయి. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సారధ్యంలో మైదానాలన్నీ మెరుస్తున్నాయి. కన్నుల పండుగగా జరిగే క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడా కారుడు ఆనందంగా ఉంటేనే మనకు సంతోషమని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు అన్నారు. ఆయన శనివారం మణుగూరు క్యాంపు కార్యాలయంలో రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి ఏడాది కేసీఆర్ కప్ క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మణుగూరులో క్రీడలు ఆదుకునేందుకు ఫ్లెడ్ లైట్స్ లేవని, క్రీడాకారుల కోసం జడ్పి కో-ఎడ్యుకేషన్ హై స్కూల్ ఆవరణలో శాశ్వతంగా ఉండేలా ఫ్లెడ్ లైట్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, సారపాకలో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ నాయకులు ప్రతిరోజూ వచ్చి క్రీడా పోటీలను పరిశీలించాలని, తమ గ్రామ పిల్ల ఎలా ఆడుతున్నారో పరిశీలించాలన్నారు. వారు గెలవడానికి ఎలాంటి ప్రొత్సాహం కావాలో వారికి అందజేయాలన్నారు. సర్పంచ్, జడ్పిటీసి, ఎంపీపీ, మండల అధ్యక్షులు టీమ్ లీడర్లన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారునికి ఉచితంగా భోజన సదుపాయం, వసతి కల్పించడం జరుగుతుందన్నారు. క్రీడల్లో పాల్గొనే వారికి వాలీబాల్, నెట్ ఉచితంగా అందజేస్తామన్నారు. హ్యాబిటేషన్ ఆధారంగా 700 ల గ్రామాలు ఉన్నాయని, ప్రతి గ్రామానికి వాలీబాల్, నెట్ అందజేయడం జరుగుతుందన్నారు. మార్చి నెలలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే 1400 ల బాట్ లు సిద్ధం చేశామన్నారు. ప్రతి గ్రామానికి 2 బాల్స్, 2 బాట్లు అందజేస్తామన్నారు. మెయిన్ గ్రామాల్లో రోజు మ్యాచ్ లు ఆడే టీమ్ లకు పూర్తి క్రికెట్ కిట్ అందజేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా పినపాక నియోజకవర్గంలోని 312 క్రీడా మైదానాల్లో ఈ ఏడాది దసరా వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చులతో అధికారికంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా విద్యార్థులకు ఎమ్మెల్యే రేగా కాంతారావు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళలు, క్రీడాకారులు పాల్గొన్నారు.