ఈ సారు మాకొద్దు…
-మద్యం మత్తులో ఉపాధ్యాయుడు…..
– పాఠశాలలో విద్యార్థుల ముందే ధూమపానం.
– నిత్యం విద్యార్థులను కొడుతున్నారని తల్లిదండ్రుల ఆరోపణ.
– గత పదేళ్లుగా ఇదే పరిస్థితి.
– పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.
మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 07: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నిత్యం మద్యం సేవించి పాఠశాలకు హాజరవుతున్నాడు. చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా వారి మధ్యలోనే ధూమపానం చేస్తున్నాడు. ఈ సంఘటన శనివారం మణుగూరు మున్సిపాలిటీలోని చినరాయిగూడెం గ్రామంలోని ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చోటు చేసుకుంది. పూణెం నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు శనివారం ఫుల్లుగా మద్యం సేవించి పాఠశాలకు హాజరయ్యాడు. అక్కడే మెట్ల మీద కూర్చొని విద్యార్థులు చూస్తుండగా బీడీలు తాగుతూ ఆనందాన్ని పొందాడు. ఇదంతా చూసిన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ప్రశ్నించారు. మద్యం మత్తులో ఉన్నప్పుడు పాఠశాలకు రావద్దని, ఇలా చేస్తే పిల్లలు కూడా అవి నేర్చుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా ఈ ఉపాధ్యాయుడు ఇలాగే మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నాడని, చిన్నపిల్లలను తొడపాశం పెడుతూ తల గోడకేసి కొడుతున్నాడన్నారు. ఎన్నిసార్లు అధికారులకు, గ్రామ పెద్దలకు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. పిల్లలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాడని, చదువు రాకుంటే చచ్చిపోమంటాడు అని, ఇలా అయితే పిల్లలని స్కూల్ కి ఎలా పంపాలన్నారు. ఎప్పుడు మద్యం సేవించి ఉంటారని పిల్లలకు చదువు చెప్పేదే లేదన్నారు. ఇదే పాఠశాలలో ఇంకొక ఉపాధ్యాయులు సమ్మయ్య రోజు వచ్చి సంతకాలు పెట్టి పోతున్నారని ఆరోపించారు. పిల్లలకు చదువు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తే మీ ఇంటి దగ్గర మీరే చదువు చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు మాకు వద్దు అని, వేరే వారిని ఇక్కడ కేటాయించాలని వారు కోరారు. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.