మండల కేంద్రంలో భారీ ర్యాలీ..
మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆదివారం జూలూరుపాడు మండల కేంద్రంలో గోర్ మాటి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరి బంజారాల సాంప్రదాయ వస్త్ర అలంకరణతో, నృత్య ప్రదర్శనలతో మండల కేంద్రంలో సాగిన ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. అనంతరం కస్తూరిబా గాంధీ పాఠశాల ఎదురుగా ఉన్న మామిడి తోటలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయాలకు అతీతంగా పాల్గొని లంబాడి జాతి కీర్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా బానోతు విజయబాయి మాట్లాడుతూ.. అగ్రవర్ణ కులాల వారు లంబాడి జాతిని అనగ తొక్కాలని, లంబాడీలకు రిజర్వేషన్ కల్పించకూడదని, ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, అలాంటి వారిని లంబాడి జాతి నాయకులు ఒకే తాటి పైకి వచ్చి మన జాతి కీర్తిని పెంచాలని ఆమె కోరారు. ధరావత్ రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ.. ఈ గోర్ మాటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ముందు ముందు ఇలాగే కొనసాగించాలని, లంబాడా సోదరులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.