మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 03… కళాతపస్వి, దర్శక దిగ్గజం, కే.విశ్వనాథ్ మృతిపట్ల బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటన లో విచారం వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు. భారత చలన చిత్ర పరిశ్రమలో విరబూసిన స్వర్ణకమలం కె. విశ్వనాధం అని కొనియాడారు. సామాజిక స్పృహ ఉన్న గొప్ప వ్యక్తి అన్నారు. తన చిత్రాలు ద్వారా ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేశారని అన్నారు. సృజనాత్మక దర్శకునిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. ఆయన రూపొందించిన ప్రతి సినిమా ఒక అద్భుతమైన కళా ఖండమని అన్నారు. కళా తపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని అన్నారు.. సౌండ్ రికార్డిస్ట్ గా సినీ ప్రస్థానం ఆరంభించిన విశ్వనాధం భాషా, సంస్కృతికి, కళలు, సంప్రదాయాలకు పెద్ద పీట వేసి, సందేశాత్మక చిత్రాలు తీసి, ఆదర్శంగా నిలిచారని అన్నారు. తెలుగు సినిమాను ఖండంతరాలు వ్యాపింప జేసిన వారిలో విశ్వనాధం గారిది మహోన్నతమైన స్థానమని చెప్పారు. కళా ఖండాలకు చిరునామా విశ్వనాధం అన్నారు. శంకరాభరణం, సాగర సంగమం వంటి అపురూప చిత్రాలను సమాజానికి అందించిన ఆయన లేని లోటు తీరనిదని తెలిపారు.తెలుగుదనాన్ని సమున్నతంగా నిలబెట్టారని తెలిపారు. ఆయన తీసిన ఒక్కో సినిమా తెలుగు సినిమా కీర్తిని దశ దిశలా చాటిందన్నారు. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చిన మహానుబావుడని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యుకు, అభిమానులకు ఎంపీ నామ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.