మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 04: మాభూమి ఎవరికి ఇవ్వొద్దని, మాకు న్యాయం చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ ఐటిఐ కళాశాల వెనుక గల భూమిని రైల్వే లైన్లో భూములు కోల్పోయిన వారికి ఇచ్చేందుకు తహసిల్దార్ నాగరాజు తన సిబ్బందితో కలిసి స్థలం వద్దకు వెళ్లారు. అప్పటికే పొలానికి సంబంధించి అసైన్డ్ పట్టా కలిగిన వారు అక్కడి చేరుకొని రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు. మా తాతల కాలం నుంచి భూమి మాధని, మాకు అసైన్ పట్టా కూడా ఉందని ఇప్పుడు దాన్ని ఎలా పంచుతారన్నారు. మా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఎనిమిది ఎకరాలను ఇద్దరు దళారులకు అప్పగించారని, దానిని వదిలిపెట్టి మాభూమి జోలికి రావడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వడం లేదని, కేసులు పెడతామని బెదిరించి దౌర్జన్యంగా సంతకాలు కూడా పెట్టించుకున్నారన్నారు. మేము అమాయకులమని, నిరుపేదలమని మాకు న్యాయం చేయాలని వారు ఆందోళన చేయడంతోరెవెన్యూ అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.