UPDATES  

 పాత్రికేయులకు శిక్షణ సంక్షేమం కోసం మీడియా అకాడమీ కృషి చేస్తుంది తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 11…పాత్రికేయుల శిక్షణ, సంక్షేమం కోసం మీడియా అకాడమీ కృషి చేస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి మహిళా కళాశాలలో మీడియా అకాడమీ ద్వారా రెండు రోజుల పాటు నిర్వహించనున్న పాత్రికేయుల శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజం ప్రత్యేకమైన వృత్తి అని నిలబడి ముందుకు సాగాలని చెప్పారు. పాత్రికేయులకు ఇలాంటి శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తున్న అనేక మార్పుల కారణంగా పాత్రికేయులు ఆలోచన చేయాల్సి ఉన్నదని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు ద్వారా పాత్రికేయులు విధి నిర్వహణలో మరింత నైపుణ్యాన్ని సాధించాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. పాత్రికేయుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. కేటాయించిన విధంగా ఇప్పటి వరకు రూ.42 కోట్లు మంజూరు చేసారని వాటిలో ఇప్పటి వరకు రూ. 17 కోట్ల రూపాయలు పాత్రికేయుల సంక్షేమానికి వినియోగించినట్లు స్పష్టం చేశారు. ఇంకనూ రూ. 58 కోట్లు మంజూరు కావాల్సి ఉందని, విడతలు వారిగా మంజూరు కానున్నట్లు పేర్కొన్నారు. మంజూరు చేసిన నిధుల మూలధనం నుంచి పాత్రికేయుల సంక్షేమానికి వినియోగించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 490 పైగా పాత్రికేయుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా లక్ష రూపాయలు ఆర్ధిక సాయం మంజూరుతో పాటు, ప్రతి నెలా 3 వేల రూపాయలు పింఛను, చదువుకునే పిల్లలకు వేయి రూపాయలు ఉపకార వేతనాలు మంజూరు చేసినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో 5 వేల మంది పాత్రికేయులకు రూ.7 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు తెలిపారు. కరోనా వంటి బయానక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులను ఆదుకున్నదని ఇదంతా ప్రభుత్వం గుర్తించడం వల్ల సాధ్యమైందన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు ద్వారా ఈ ఆరేండ్ల కాలంలో రూ.33 కోట్ల రూపాయల విలువైన వైద్య సేవలు పాత్రికేయులు వినియోగించుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఖమ్మం వచ్చిన సందర్భంలో పాత్రికేయులకు ఇండ్లస్థలాలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఖమ్మంలో ఇంటి స్థలాలు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, రానున్న అతికొద్ది రోజుల్లో అన్ని జిల్లాలలో పాత్రికేయులకు ఇంటిస్థలాలు మంజూరు అవుతాయని ఆయన చెప్పారు. కొత్తగూడెంలో కూడా 17 ఎకరాల్లో ఇంటి స్థలాలు ఇవ్వడానికి గుర్తించారని అన్నారు. ఆధునిక జర్మలిజంపై పాత్రికేయులకు సమగ్రమైన అవగాహన అవసరమని తెలిపారు. పాత 10 జిల్లాలలో 8 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు మిగతా నూతన జిల్లాలు ఏర్పాటు తదుపరి అన్ని జిల్లాలలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు మీడియా అకాడమీ ద్వారా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పాత్రికేయంలో వేగం పెరిగిందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులకు శిక్షణ తప్పనిసరి అని అన్నారు. నాణ్యమైన వార్తలు ప్రజలకు చేరవేయడంలో శిక్షణా కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని . మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి మనం వార్తలను అందించాలని కోరారు. అనుభవంతో పాటు వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మారుతున్న పాత్రికేయంలో పోటీతత్వంతో వాస్తవాలను ప్రజలకు తెలియచేయడంలో ముందుండాలన్నారు.
తెలంగాణ పోరాటంలో ఉదృతంగా పాల్గొన్నారని, అస్తిత్వంతో పోరాడారని, అనేక శక్తులతో కలిసి నడిచామని, చైతన్యాన్ని ప్రదర్శించింది పాత్రికేయులేనని గుర్తు చేశారు. అనంతరం సోషల్ మీడియా ధోరణులు అనే అంశంపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ సుధాకర్ రెడ్డి, గ్రామీణ వార్తలు అనే అంశంపై సీనియర్ పాత్రికేయులు రమణారావులు పాత్రికేయులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి, టియుడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి మారుతిసాగర్, సీనియర్ పాత్రికేయులు యోగానంద్, విష్ణువర్ధన్, టియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షఫీ ఖమ్మం అధ్యక్షులు ఆదినారాయణ, టెంజు జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహారావు, జాతీయ కౌన్సిల్ మెంబర్ చండ్ర నరసింహరావు, బాలయోగి, అకాడమీ మేనేజర్ వెంకటేశ్, ఓఎస్డీ రహమాన్, వనజ, జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన మీడియా అకాడమీ ఛైర్మన్ కు డిపిఆర్ శ్రీనివాస్ మొక్కను బహుకరించి శాలువాతో గనంగా సత్కరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !