మన్యం న్యూస్, ఇల్లందు టౌన్ మార్చి 21:ఇల్లందులోని సింగరేణి ఏరియా స్టోర్స్ లో దాదాపు రూ.60 లక్షలు విలువచేసే కేబుల్ చోరీకి గురైంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన సింగరేణి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఇంత పెద్దమొత్తంలో కేబుల్ అపహరణకు గురికావడంతో ఈ విషయం సింగరేణి వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేబుల్ అపహరణ విషయం తెలుసుకున్న మీడియా వారు ఏరియా స్టోర్స్ ఇన్చార్జి ఆనందరావును సంప్రదించగా ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేబుల్ అపహరణకు గురైనమాట వాస్తవమేనని, ఆ కేబుల్ విలువ రూ. 8.5 లక్షలవరకు ఉంటుందని ఆయన తెలిపారు. వాస్తవానికి 9.4 టన్నుల కేబుల్ అపహరణకు గురైంది. దీని విలువ దాదాపు 55-60 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. కానీ సింగరేణి యాజమాన్యం మాత్రం తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు లెక్కలను ప్రచారం చేస్తున్నారు.విజిలెన్స్ అధికారులు లోతైన విశ్లేషణ చేస్తే నిజానిజాలు బయటికొస్తాయని ఈ ప్రాంత సింగరేణి ఉద్యోగులు అంటున్నారు.