మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 21, కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రంలోకి ప్రవేశించడంతో మండల సిపిఎం పార్టీ శ్రేణులు జన చైతన్య యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అధిక ధరల భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తుందని, అలాంటి మతోన్మాద పార్టీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వొద్దని, రాష్ట్రంలో జన చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నందునే ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నామన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఎవరున్నా వారికి మా మద్దతు ఉంటుందని తెలిపారు. బిఆర్ఎస్ తో పొత్తు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆ విషయంపై చర్చిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోతినేని సుదర్శన్ రావు, వెంకటేశ్వరరావు, భూక్య వీరభద్రం, కాసాని ఐలయ్య, చందర్ రావు, చీమలపాటి భిక్షం, యాస నరేష్ తదితరులు పాల్గొన్నారు.