- శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్…
- – ఎనిమిదిన్నరేళ్ళు గడిచినా భద్రాచల పుణ్యక్షేత్రం హుండీలో రూ.100 వేసిన పాపాన పోలేదు..
- – దళితబంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు
- – ఇప్పుడు గిరిజన బంధు ఇస్తానన్ని మాయమాటలు
- – బాధిత నిరుద్యోగులకు లక్ష రూపాయలు ఇవ్వాలి
- – భద్రాచలం ఆత్మీయ సమ్మేళనంలో కేసిఆర్ పై నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ పొంగులేటి
భద్రాచలం, మన్యం న్యూస్ :
మైకు తీసుకుంటే ప్రజలను మభ్య పెట్టడంలో ఈ ముఖ్యమంత్రి దిట్ట… మాటలకే పరిమితం తప్ప… చేతలు అనేవి ఈ సీఎంలో లేవు. భద్రాచల పుణ్యక్షేత్రానికి వంద కోట్ల రూపాయల నిధులు ఇస్తానన్న మాట అటు ఉంచితే గడిచిన ఎనిమిదిన్నరేళ్ళలో వందరూపాయలు కూడా హుండీలో వేసిన పాపాన పోలేదు. జెండా ఏదైనా రాబోయే ఎన్నికల్లో సీఎం కేసిఆర్ ను గద్దె దించటమే తమ ఎజెండా అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి భద్రాచలం ఆత్మీయ సమ్మేళనంలో నిప్పులు చెరిగారు.
శనివారం భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన సమ్మేళనానికి మాజీ ఎంపీ పొంగులేటి ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడుతూ… ఆరు దశాబ్దాలుగా పోరాడి సంపాదించుకున్న రాష్ట్రం ఇప్పుడు సీఎం కేసిఆర్ వల్ల దగా పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. భద్రాచల నియోజకవర్గానికి వరద ముప్పు సమయంలో వేయికోట్ల రూపాయలు నిధులు ఇస్తానని ప్రకటించి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. టీఎస్పీఎస్ఈ పేపర్ లీకేజీలో తెలంగాణ ప్రభుత్వ అధికారుల, ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని ఆరోపించారు. ఈ తప్పిదానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహిస్తూ పరీక్ష రాసిన ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్ళు, నిధులు, నియమాకాలన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయి తప్పా అర్హులు అయిన ఏ ఒక్కరికి న్యాయం చేకూరలేదన్నారు. నియమాకాలకోసం పోరాడి సంపాదించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగాలు లేక యువత దగా పడుతుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఉద్దరించలేని ఈ సీఎం దేశాన్ని ఉద్దరిస్తాడట… అంటు ఎద్దేవా చేశారు. ఏళ్ళు గడుస్తున్న పోడు భూముల రైతుల సమస్యలకు పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఒక్క పోడు భూమి పట్టాదారునికి కూడా పట్టా ఇచ్చిన దాఖలా లేదన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సిట్ కి కాకుండా సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జీచే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అతి త్వరలోనే తన జెండా ఎజెండాను ప్రకటిస్తానని జెండా ఏదైనా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రానివ్వకుండా ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ తెల్లం వెంకట్రావ్ బరిలో ఉంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలందరి దీవెనలతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అంటూ పొంగులేటి తన ప్రసంగాన్ని ముగించారు.