- కామేపల్లి మండల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం
- త్వరలో దేశవ్యాప్తంగా గులాబీ ప్రభంజనం బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే ఖబడ్దార్: ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందు..కామేపల్లి మండలం శ్రీనివాస్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ ఆశయసాధనకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తూ సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా కేసీఆర్ నిలిపారన్నారు. గ్రామగ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కోకొల్లలు అని, కొంతమంది ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి స్వార్థపూరిత రాజకీయాలకు తెరలేపుతూ కాకమ్మ కబుర్లు చెబితే నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరన్నారు. అటువంటి నాయకులకు ప్రజాక్షేత్రంలో నియోజకవర్గ పజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ని విమర్శించే వారిని నిగ్గదీసి అడగండి అని నిలదీసి కడగండి అని అన్నారు. ఇంకోసారి విమర్శిస్తే ఖబర్దార్ అంటూ ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ హెచ్చరించారు. జాతీయస్థాయిలో “అబ్ కి బార్.. కిసాన్ సర్కార్” అనే నినాదంతో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశస్థాయిలో ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమయ్యారని రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా గణాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. రైతులకు రైతు బీమా, రైతు బంధు, ఎకరాకు పదివేల రూపాయల పెట్టుబడి సాయం, ఉచిత కరెంటు అందిస్తూ రైతును తెలంగాణలో రాజుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతులు రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. నిరుపేదింటి ఆడపడుచులకు కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి వారి ఇండ్లలో కాంతులు నింపారన్నారు. కంటివెలుగు యావత్తు దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఉచితంగా కొన్ని కోట్లాదిమంది కంటి పరీక్షలు చేయించుకుని కళ్లద్దాలు, కంటి శస్త్ర చికిత్సలు, ఐ డ్రాప్స్ లాంటివి తీసుకుని లబ్ధి పొందుతున్నారని తెలిపారు. నేడు ప్రతిగ్రామాల రూపురేఖలు మారిపోయాయంటే కారణం కేసీఆర్ అన్నారు. ప్రజలు ప్రయాణించేందుకు సిసి రోడ్లు, రాత్రి వేళల్లో వీధిలైట్లు, తాగునీరు అందించేందుకు ప్రతిఇంటికి నల్లా కనెక్షన్, వీధులు పరిశుభ్రంగా ఉండేందుకు డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, పచ్చని చెట్లు, రైతువేదికలు తదితర వాటితో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా మారాయి అన్నారు. కొంతమంది తనను అప్రతిష్ట పాలు చేసేందుకు బురద జల్లుతున్నారని అలాంటివారికి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని కార్యకర్తల కోసం రెండు లక్షల ప్రమాదభీమా అందిస్తున్న కార్యకర్తల పక్షపాతి ప్రభుత్వం బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీ పునాది అని వ్యాఖ్యానించారు. పార్టీని నమ్ముకొని పార్టీపటిష్ట నిర్మాణం కొరకు కృషిచేస్తున్న కార్యకర్తల కోసం అహర్నిశలు పరితపిస్తూ కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, టేకులపల్లి మండల అధ్యక్షుడు, కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.