మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 18 మణుగూరు సింగరేణి జిఎం కార్యాలయ ప్రాంగణంలో వచ్చే నెల 5వ తేదీన జరుగునున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని,పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యం తో సింగరేణి కాలరీస్ ఆధ్వర్యం లో గురువారం పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇంచార్జ్ జనరల్ మేనేజర్ జి. నాగేశ్వర రావు మాట్లాడుతూ, ప్రస్తుతం భరించలేని అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులతో రాష్ట్ర ప్రజలే కాక పశు పక్ష్యాదులు కూడా అల్లాడిపోతున్నాయి అన్నారు. అందుకు కారణం వాతావరణం లో వచ్చిన అనూహ్యమైన మార్పులే అని,ఆ మార్పులకు కారణం నిస్సందేహంగా మానవ తప్పిదాలే అన్నారు.ఈ తప్పిదాలు ఇలాగే కొనసాగితే జీవకోటి మనుగడ అత్యంత దుర్లభం అవుతుంది అని తెలిపారు.కాబట్టి మన జీవన విధానాన్ని మార్చుకొని భూతాపం తగ్గించేందుకు వృక్ష సంపదను కాపాడుతూనే విరివిగా మొక్కలు నాటుతు చెట్లని పెంచాలి అన్నారు. ఇంటింటా ఇంకుడు గుంటలు ద్వారా నీరు నిలువ చేసుకోవాలి అని,ఫ్రీడ్జ్, కూలర్లు,ఫ్యాన్ లు,లైట్లు పరిమితంగా వినియోగిస్తూ శక్తిని ఆదా చేయాలి అన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి అని,ఇంట బయిట పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలి అని తద్వారా సురక్షితమైన, స్వచ్ఛమైన పర్యావరణాన్ని ఆవిష్కరించుకోవాలి అన్నారు. ఇది సామాజిక బాధ్యత కాబట్టి ఈ విషయమై సింగరేణి ఉద్యోగులకు మరింతగా అవగాహన పెంచేందుకు గాను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యం తో మన సింగరేణి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని తెలిపారు.మన బ్రతుకు,మన ముందు తరాల వారి భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని సూచించారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం డి.లలిత్ కుమార్, డిజిఎం పర్సనల్ ఎస్.రమేశ్, డిజిఎం పర్చేస్ శ్రీనివాస్ మూర్తి,డిజిఎం ఫీనాన్స్ అనురాధ,పర్యావరణ అధికారి జే శ్రీనివాస్,డివై.ఎస్ఈ ఐఈడి శ్రీనివాస్,డివై.ఫీనాన్స్ మేనేజర్ పి రమేశ్,మినిస్ట్రియల్ స్టాఫ్, జిఎం పిఏ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.