రాజకీయాలలో విపక్ష నేతలు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం అనేది సర్వ సాధారణమైన విషయం అనేది అందరికి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసు కేసు నమోదు కావడంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మండిపడ్డారు.
చంద్రబాబుపై పెట్టిన కేసు అసంబద్ధంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతను అడ్డుకోవాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరుతో రెచ్చగొట్టారంటూ చంద్రబాబుపై కక్షపూరిత కేసు నమోదు చేశారని అన్నారు. ప్రతిపక్ష నేతను ఫినిష్ చేయాలని కామెంట్ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
నచ్చని వ్యక్తులపై కేసులు పెట్టుకుంటూ పోతారా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల నుంచి పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏం సాధించిందని విమర్శించారు. ప్రచారాలు చేసుకోవడం తప్ప వీరు సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. విజయనగరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు