మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక జిల్లా
అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి
కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. దరఖాస్తులు పరిశీలించిన కలెక్టర్ ఆయా మండలాల తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి సమస్య యొక్క
స్వభావాన్ని తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు కొన్ని ఇలా ఉన్నాయి. చర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బట్ట అనిత భర్త లేటు మంచర్ల జగదీష్ కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తూ ఎన్నికల విధుల్లో కరోనాతో మరణించారని కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్నానని కావున తనకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు కొరకు జడ్పి సిఈఓకు ఎండార్స్ చేశారు. భద్రాచలం మండలం రాజుపేట కాలనీకి చెందిన రామక్రిష్ణ సైకిల్ షాపులో పనిచేస్తూ జీవనం
కొనసాగిస్తున్నానని ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ పోషణ చాలా కష్టంగా కొనసాగుతున్నదని పేర్కొంటూ తనకు
బిసి రుణం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు కొరకు బిసి సంక్షేమ అధికారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డిఆర్డిఓ మధుసూదన్రాజు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.