UPDATES  

 ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ కన్నెర్ర

ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ కన్నెర్ర
* తప్పుడు నివేదికలు ఇస్తారా అంటూ అసహనం
* ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ
* సగం పనులు చేసిన కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు
* ప్రభుత్వ బడులు సుందరంగా కనిపించాలి
* సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచన

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
నూరు శాతం పనులు జరిగినట్లు నివేదికలు ఇచ్చారని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అసంపూర్తిగా ఉన్నాయని
జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం
అశ్వాపురం మండలంలోని సీతారాంపురం ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
మన ఊరు – మనబడి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, తప్పుడు నివేదికలు ఇచ్చిన ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిఈ రమేష్ కు, ఏఈ గణేష్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని చెప్పారు. పనులు పర్యవేక్షణ చేయడమే కదా ఇంజనీరింగ్ అధికారుల పని అని పూర్తిగా పనులు చేపించి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాల్సింది పోయి సగం, సగం పనులు చేస్తే కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు
తీసుకోలేదని ప్రశ్నించారు. కలెక్టర్ వచ్చి పరిశీలించి చెప్తే తప్ప పనులు చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు – మనబడి కార్యక్రమంలో పాఠశాలలకు నిర్దేశించిన విధంగా విద్యుద్దీకరణ, మంచినీటి సరఫరా
చేయాలని అసంపూర్తిగా ఉంటే సహించనని హెచ్చరిస్తూ వారం రోజుల్లో అన్ని పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులు పర్యవేక్షణ, ప్రగతిపై విద్యా, ఇంజనీరింగ్ ఏజన్సీలు సమీక్షలు నిర్వహించాలని, పనులను వేగవంతం చేయాలని సూచించారు. అంచనాలు మేరకు పనులు పూర్తి కావాలని
లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఎపుడో పురాతన కాలంలో నిర్మించినట్లుగా ఉన్నాయని మంచినీటి సరఫరా పూర్తి చేయలేదని పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
తరగతి గదుల్లో లైట్లు వెలగడం లేదని తక్షణమే లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పాఠశాల ప్రాంగణం మొత్తం పరిశీలించిన కలెక్టర్ తరగతి గదుల్లో అంచనాలు మేరకు ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యాశాఖ
అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు చెప్పే లెక్కలకు పొంతన లేదని, పర్యవేక్షణ కొరవడిందని అసంతృప్తి వ్యక్తం
చేశారు. పనులు పరిశీలన చేయకుండా ఎలా సంతకాలు పెట్టి నివేదికలు పంపారని, కలెక్టర్ వస్తున్నా ఏఈ ఎందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు, మహిళా సంక్షేమ అధికారి విజేత, జడ్పిటిసి సులక్షణ, యంపిపి సుజాత, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డిఈ రమేష్, ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి, విద్యాశాఖ కో ఆర్డినేటర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !