క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా
* పాత్రధారులు, సూత్రధారులపై చర్యలు శూన్యం
* బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
జిల్లా కేంద్రంలో అక్కడక్కడ ఖాళీగా ఉన్న స్థలాలపై కొందరు కబ్జాదారులు కన్నేసి ఆక్రమణలకు పాల్పడుతున్న విషయం అందరికి తెలిసిందే. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని పాత కొత్తగూడెంలో పేదలకు ఇచ్చేందుకోసం ప్రతిపాదించిన స్థలంలో శనివారం రాత్రికిరాత్రి మున్సిపల్ పాలకపక్షంలోని కీలక వ్యక్తి కబ్జాకి పాల్పడ్డాడని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి పాత కొత్తగూడెంలోని పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన 2000 గజాల స్థలాన్ని ఆక్రమించారని ఆరోపించారు. ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఇక్కడకు చేరుకొని కబ్జా చేసిన స్థలాన్ని రాత్రికిరాత్రే వెలిసిన కాంపౌండ్ ను తొలగించారని తెలిపారు. తూతూ మంత్రంగా కూల్చివేతలు చేస్తే సరిపోదని సదరు వ్యక్తులపై పోలీస్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. క్రీడా స్థలం పేరుతో ప్రభుత్వ స్థలాన్ని సొంతంగా ఆక్రమించుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్తగూడెంలోని తహసీల్దారులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారని వీరి స్థానంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దారులకు కొత్తగూడెంపై స్వరూపం తెలియదని దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు ప్రభుత్వ స్థలాలను తమదిగా చెప్పుకుంటూ దరఖాస్తులు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాల్సి ఉందని కొందరు రెవెన్యూ అధికారులు మున్సిపల్ సిబ్బంది అక్రమ సంపాదనకు అలవాటు పడి దొడ్డిదారిలో ప్రభుత్వ స్థలాలను కొందరి నాయకులకు లోపాయకారికంగా ఇచ్చేసేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం నడిబొడ్డులో రైతు బజార్ స్థలాన్ని సైతం ఈ విధంగానే ఆక్రమించేందుకు పాల్పడిన వ్యక్తులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. కొత్తగూడెంలో భూదోపిడికి, కబ్జాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లేని పక్షంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జునరావు, జిల్లా సహాయ కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్, అసెంబ్లీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగుల రవికుమార్, అల్లకొండ శరత్, విన్నూ తదితరులు పాల్గొన్నారు.