మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకై ఆదివారం ఏర్పాటు చేసిన రోడ్ షోల మీటింగ్ లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అయితే కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో జరిగిన కేటీఆర్ రోడ్ షో కొంత అసహనానికి గురిచేసిందని పలువురు బహిరంగంగా వ్యాఖ్యానించడం జరిగింది. కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ మైక్ కిరికిరి పెట్టింది. అంతేకాకుండా మైకు అందుబాటులో లేకపోవడంతో కేటీఆర్ ప్రక్కనున్న బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, కోనేరు సత్యనారాయణ(చిన్ని)లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా రెండు మూడు నిమిషాల తర్వాత మైకు అందుబాటులోకి రావడం అది కూడా మధ్య మధ్యలో ఆగుకుంటూ రావడంతో స్టేజి మీద ఉన్న వారికి రోడ్ షో కి హాజరైన ప్రజలకి కొంత కోపం తెప్పించింది. మైక్ సెట్ నాణ్యమైనదిగా ఏర్పాటు చేయకపోవడంతో వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవపై రాజ్యసభ సభ్యుడు కొత్తగూడెం అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ వద్దిరాజు రవిచంద్ర గరం అయినట్లు ప్రచారం జరగడం గమనార్హం.