UPDATES  

 పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్.. ఫిబ్రవరి 13న నల్లగొండలో సభ…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అడుగుపెట్టారు. దాదాపు రెండు నెలల తర్వాత పార్టీ ఆఫీసుకు వచ్చారు. ఈ సమయంలో గులాబీ బాస్ మరోసారి సెంటిమెంట్, ముహూర్తం ఫాలో అయ్యారు. కేసీఆర్‌కు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మహిళా కార్యకర్తలు మంగళ హారతులిచ్చి స్వాగతం పలికారు.

 

కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా జలాలపై పార్టీ ఆఫీసులో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు.

 

బీఆర్ఎస్‌ నేతలతో ముగిసిన కేసీఆర్‌ భేటీ ముగిసింది. కృష్ణా జలాల అంశాలే పార్లమెంట్ ఎన్నికల అస్త్రంగా మలుచుకోవాలని కేసీఆర్ కేడర్ కు సూచించారు. ఇందుకు నిరసనగా ఈ నెల 13న నల్లగొండలొ సభ నిర్వహించాలన్నారు. కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని నిర్ణయించారు.

 

KRMBకి ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకారం తెలపటం దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హకులపై గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు. డ్యామ్‌కు సున్నం వేయాలన్నా కేఆర్‌ఎంబీ అనుమతి కావాలని.. రాష్ట్ర ప్రయోజనాలే BRSకు ముఖ్యం అని చెప్పారు. BRSకు పోరాటం కొత్త కాదు అని అన్నారు.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిరోజులకు కేసీఆర్ ఇంట్లోని బాత్ రూమ్ జారిపడ్డారు. తుంటి ఎముక విరిగిపోవడంతో హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. తుంటి ఎముకకు సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తొలుత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేకపోయారు.

 

ఆరోగ్యం కుదుటపడటంతో గులాబీ బాస్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఫిబ్రవరి 1న అసెంబ్లీకి వచ్చారు. అదేరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఫిబ్రవరి 8 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది.

 

మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న బీఆర్ఎస్ .. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు.

 

2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచినా.. ఆ వెంటనే 4 నెలలకు జరిగిన ఎన్నికల్లో అదే స్థాయిలో ఎంపీ సీట్లు సాధించలేకపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. మరి మరో రెండు నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 5 కంటే తక్కువ ఎంపీ స్థానాలకు పరిమితమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !