పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కు గాయాలయ్యాయి.
తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ నేడు ర్యాలీ నిర్వహించారు. ఆయన ఓ కంటైనర్ వాహనంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
కాగా, కాల్పులు జరిపిన వారిని అరెస్ట్ చేసినప్పటికీ, వారెవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. ర్యాలీలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్ రాజధాని ఇస్లామాబాద్ వైపు పయనిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇమ్రాన్ తో పాటు ఆయన ముఖ్య అనుచరుడిగా భావించే ఎంపీ ఫైజల్ జావెద్ కూడా గాయపడ్డారు.
పాక్ ప్రధాని పదవిని కోల్పోయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ తన ప్రాణాలకు ముప్పు ఉందని పలు వేదికలపై చెబుతున్నారు. అదే సమయంలో అధికార పక్షంపైనా, పాక్ నిఘా విభాగం ఐఎస్ఐ పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఐఎస్ఐ రహస్యాలు తన గుప్పిట్లో ఉన్నాయని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ పై కాల్పులు జరగడం గమనార్హం