UPDATES  

 కేసీఆర్ ఫోకస్ రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాలపై..?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పేయాలని తెగ ఆరాటపడుతున్నారు. అందుకే.. దసరా పండుగ నాడే టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. ఇంతలో మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ రావడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. ప్రస్తుతం కేసీఆర్ ఫోకస్ దేశ రాజకీయాల నుంచి మునుగోడుకు షిఫ్ట్ అయింది. ఎందుకంటే దేశ రాజకీయాలు తర్వాత ముందు మునుగోడులో గెలవకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే పెద్ద దెబ్బ పడే ప్రమాదం ఉంది. అందుకే.. ప్రస్తుతానికి తన ఫోకస్ ను మాత్రం మునుగోడుకు మార్చారు కేసీఆర్. అంతేకాదు.. మునుగోడులో గెలిచి ఏకంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆలోచిస్తున్నారు.

అందుకే.. మునుగోడులో టీఆర్ఎస్ ముఖ్య నేతలు మొత్తం మోహరించారు. అక్కడే మకాం వేశారు. దేశంలోనే మునుగోడు ఉపఎన్నికను అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా మార్చారు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇష్టం ఉన్నట్టుగా డబ్బులను ఖర్చు చేస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో చేరాలని.. నియోజకవర్గంలోని సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీలకు ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్లను డబ్బులతో ఎర వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు కేసీఆర్ ఇన్ని ప్లాన్స్ వేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మాత్రం మునుగోడులో పెరగడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ చేయించిన అంతర్గత సర్వే, ఇంటలిజెన్స్ సర్వే ఏది చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీకి అంత అనుకూలంగా లేదని తెలుస్తోంది.

టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మునుగోడులో పెరిగిందా? కుల సంఘాలతో కూడా టీఆర్ఎస్ పార్టీ మంతనాలు జరుపుతోందట. అన్ని పార్టీలకు తాయిలాలు కూడా ప్రకటిస్తున్నారు. అయినా కూడా పార్టీకి ఏమాత్రం మద్దతు లభించడం లేదట. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ టీఆర్ఎస్ డొంక కదులుతోంది. ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేయడంతో మరోసారి టీఆర్ఎస్ లో కదలిక మొదలైంది. ఆ తర్వాత ఇక అరెస్ట్ చేసేది కవితనే అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో వెంటనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. కేంద్ర హోంమంత్రితో మంతనాలు జరుపుతున్నారట. కానీ.. హోంమంత్రి అమిత్ షా.. కేసీఆర్ తో భేటీ మాత్రం కాలేదు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఊరట మాత్రం లభించలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !