జీహెచ్‌ఎంసీ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు కాంబినేషన్ టికెట్‌ను రూ.20 నుంచి రూ.10కి తగ్గిస్తున్నట్లు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు శుభవార్త అంటూ టీఎస్ఆర్టీసీ ట్వీట్ చేసింది. మెట్రో కాంబి టికెట్ ధరను రూ.20 నుంచి రూ.10కి తగ్గించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుందని.. విద్యార్థుల సౌకర్యార్థం తగ్గించామని వెల్లడించింది. మెట్రో సర్వీసుల్లో ప్రయాణించేందుకు సిటీ బస్ పాస్ ఉన్న విద్యార్థులు దీనిని ఉపయోగించుకోవచ్చుని పేర్కొంది.
విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) జారీ చేసిన బస్ పాస్ ఇక నుండి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉపయోగించడానికి అర్హత పొందుతుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల కొరత విద్యార్థుల ప్రయాణానికి ఇబ్బందిగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సగటున కళాశాల బస్సులు సంవత్సరానికి రూ. 30,000 వసూలు చేస్తాయి.. అయితే RTC బస్సు పాస్‌కు 10 నెలలకు 4,000 మాత్రమే ఖర్చు అవుతుంది. ప్రస్తుతం కళాశాల విద్యార్థులకు 500 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.