ఆదిలాబాద్, మన్యం న్యూస్ : ఆదిలాబాద్ జిల్లాలో దూసుకొచ్చిన యువ రాజకీయ కెరటం కంది శ్రీనివాసరెడ్డి. ప్రత్యర్ధులను ప్రశ్నతోనే హడలెత్తిస్తూ ప్రజాదరణతో ముందుకెళ్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నుండి బరిలో నిలవనున్న కంది శ్రీనివాసరెడ్డి అన్ని హంగులతో.. ప్రత్యర్ధులకు అందనంత వేగంగా ముందుకెళ్తున్నాడు. తెరవెనుక కుట్రలను అధిగమిస్తూ.. ప్రజల మనసులు గెలిచే లక్ష్యంతో కదులుతున్నాడు. ఇటీవల కాలంలో మాజీమంత్రి జోగురామన్నపై నేరుగా సంధిస్తున్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, జోగు రామన్న బిజినెస్ పార్ట్ నర్లు కావడం, దందాలు కలిసి చేస్తారన్న అభియోగాలు ఉండడంతో ప్రజలు వీరిద్దరూ దొందూదొందేనన్న అభిప్రాయంతో ఉన్నారు. ప్రస్తుత బిజెపి నేత సుహాసిని రెడ్డికి జోగురామన్నే ఫండ్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడన్న చర్చ ఉన్నది. ఈ క్రమంలో అందరూ జోగురామన్న సహచరులే కావడంతో.. జోగురామన్న రాజకీయంలో వీరిద్దరూ చాలాకాలంగా పావులుగా ఉండడంతో ఆదిలాబాద్ లో రాజకీయం వార్ వన్ సైడ్ అన్నట్లు ఉండేది. కంది శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఈ సీన్ పూర్తిగా మారింది. జోగురామన్న వీరిద్దరి ద్వారా కంది శ్రీనివాసరెడ్డి స్పీడుకు ఎంతగా బ్రేకులు వేద్దామని ప్రయత్నించినా సక్సెస్ కావడం లేదు. ఇటు సొంతపార్టీల్లోనూ జోగురామన్న ఎజెండా కోసం మీరిద్దరూ పనిచేస్తారా అన్న ఛీత్కారాలు ఎదురవుతున్నాయి.
దమ్మున్న యువకుడు
యువనేత కంది శ్రీనివాసరెడ్డి తన ప్రశ్నలు, వాక్పటిమతో అదరగొడుతున్నాడు. జోగురామన్న అవినీతికి పాల్పడ్డాడని ప్రశ్నిస్తున్నాడు. ప్రతిరోజూ పది నుండి పదిహేను గ్రామాలు చుట్టేస్తూ లీడర్ అంటే నువ్వే అనిపిస్తున్నాడు. ప్రజాసేవా భవన్ ద్వారా ప్రతిరోజూ వేయిమందికి అన్నదానం చేస్తూ రియల్ లీడర్ గా, గరీబోళ్ళ ఆకలితీర్చే నాయకుడిగా కంది శ్రీనివాసరెడ్డి ప్రజాభిమానం పొందుతున్నాడు. పేదింట పుట్టి కష్టపడి చదివి, అమెరికాలో అనేక కంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించే సంస్థలు నెలకొల్పిన కంది శ్రీనివాసరెడ్డి తన సొంత నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు ఆదిలాబాద్ రాజకీయాల్లోకి వచ్చాడు. ఆదిలాబాద్ డెవలప్ మెంటే టార్గెట్ గా అద్భుత ప్రణాళికలతో ముందుకెళ్తున్నాడు. సొంతగూడు లేని పేదల కోసం, ఫించన్లు, రేషన్ కార్డులు, విద్య వైద్యంపై గట్టిగా ప్రశ్నిస్తూ.. ముందుకెళ్తున్నాడు. నాలుగుసార్లు గెలిచి జోగురామన్న చేయని పనులను ప్రశ్నిస్తున్నారు.
గిరిజనులందరికీ ప్రతిఇంటికీ రూ.10లక్షల చొప్పున గిరిజన బంధు ఇవ్వాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రశ్నిస్తున్నాడు. ఎమ్మెల్యే జోగురామన్న ఏకపక్ష ధోరణిని ప్రశ్నిస్తూ.. ముందుకు సాగుతున్న కంది శ్రీనివాసరెడ్డికి ఆదిలాబాద్ పట్టణంతో పాటు జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్ మండల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనేకమంది ముఖ్యనేతలు నీకే మద్దతుగా ఉంటాం అని లోపాయికారీగా కలిసి వెళ్తున్నారు.