UPDATES  

 మీ వాట్సాప్ డేంజర్ లో ఉన్నట్టే?

ఇప్పుడు వాట్సాప్ లేనిదే ఎవరికీ పూట గడవదు.. కొట్టుకోవడాలు అయినా.. తిట్టుకోవడాలు అయినా.. ముద్దులైనా.. ముచ్చట్లైనా.. మన పనులు.. బిల్ పేమంట్స్.. ఆఫీస్ వర్కులు పలకరింపులు అన్నింటికి వాట్సాప్ దిక్కు. మొన్నీ మధ్యన గంట ఆగిపోతేనే అంతా ఆగమాగమైన పరిస్థితి నెలకొంది. ఫేస్ బుక్ కు చెందిన ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఇప్పుడు అందరికీ నిత్యకృత్యమైంది. అయితే తాజాగా వాట్సాప్ నుంచి భారీగా డేటా లీక్ కావడం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్ లైన్ లో విక్రయానికి ఉంచినట్లు తాజాగా సైబర్ న్యూస్ సంచలన నివేదిక బయటపెట్టింది. అమెరికా సహా పలు దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను హ్యాకర్లు అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. ఈ వార్త తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. తమ డేటా అంతా చోరీకి గురైందని.. రహస్యాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన చెందుతున్నారు.

48.7 కోట్ల వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లతో 2022 డేటాబేస్ ను విక్రయిస్తున్నట్టు ఓ హ్యాకర్ ఆన్ లైన్ లో ప్రకటన ఇవ్వడంతో ఈ భారీ హ్యాకింగ్ సంగతి బయటపడింది. అమెరికా, యూకే, ఈజిప్ట్, సౌదీ అరేబియా, సహా 84 దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను అమ్మకానికి పెట్టారు. ఇందులో భారత యూజర్లు కూడా ఉండడంతో అందరి డేటా ప్రమాదంలో పడిపోయింది. అత్యధికంగా ఈజీప్ట్ నుంచి 4.5 కోట్ల మంది.. ఇటలీ 3.5 కోట్ల మంది అమెరికా నుంచి 3.2 కోట్ల మంది ఉన్నారు.ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నంబరును ఒక్కో ధరతో విక్రయించారని తెలిసింది. ఈ నంబర్లను సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేసి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్ లు వస్తే స్పందించొద్దని సూచించింది. ఇప్పటికే 50 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్ల డేటా మెటా నుంచి లీక్ అయ్యింది. ఇప్పుడు వాట్సాప్ డేటా కూడా గల్లంతు కావడంతో అందరూ తమ భద్రతకు ముప్పుగా అభివర్ణిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !